చంద్రబాబువి ఇంకుడు గుంతలు, రాజశేఖర్ రెడ్డివి బొంకుడు గుంతలు : కేసీఆర్

మాజీ సీఎం చంద్రబాబు, దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో.. చంద్రబాబు ఇంకుడు గుంతలు, రాజశేఖర్ రెడ్డి బొంకుడు గుంతల మాటలు చెప్పారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాల్వలన్నీ 9 నెలలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ వాగులో నీళ్లు పారినట్లు, వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు రాలుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధమున్నా రాజీనామా చేస్తానని ప్రమాణం చేశారు. 2024 తర్వాత బీజేపీ కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి దేశాన్ని నిండా ముంచాయని ఆరోపించారు. భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టమంటే కోరితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేసీఆర్ వాపోయారు.  

భవిష్యత్‌లో కేంద్రంలో తమ ప్రభుత్వమే వస్తుందని, మోడీ చేయలేని పనులన్నీ తాము చేసి చూపిస్తామన్నారు. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని ఆయన..  ఎంత ఖర్చైనా రాష్ట్రంలో ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ పోనీయమని స్పష్టం చేశారు. 16వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.