ఓడిన తుమ్మలను పిలిచి మంత్రిని చేస్తే.. ఖమ్మంలో బీఆర్ఎస్​ను గుండుసున్నా చేసిండు

రోజుకో పార్టీ మారుతూ, మోసపూరిత మాటలు చెప్పే బహురూపుల నాయకులు వస్తున్నారని.. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఖమ్మంలో ఇద్దరు బహురూపుల నాయకులున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యబోమని అంటున్నరు. డబ్బు మదంతో ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్నే కొంటమని మాట్లాడుతున్నరు. నాలుగు కాంట్రాక్టులు, నాలుగు పైరవీలు చేసుకుని పైసలు సంపాదించి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నరు”అని మండిపడ్డారు. ఎవరు అసెంబ్లీకి వెళ్లేది జనమే తేలుస్తారని చెప్పారు. ‘‘నిన్న మొన్నటి వరకు కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందన్న నాలుకలు.. ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నాయి. నరం లేని నాలుక మారవచ్చు.. కానీ సత్యం మారదు కదా. డబ్బు కట్టల అహంకారంతో వచ్చే వాళ్లకు, మాటలు మార్చే వాళ్లకు, పూటపూటకు పార్టీలు మార్చే వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తరు గానీ ప్రజలు గెలువరు” అని ఆయన అన్నారు. 


శుక్రవారం ఖమ్మం జిల్లా పాలేరు పరిధిలోని జీళ్లచెర్వు, వరంగల్​జిల్లా వర్ధన్నపేట పరిధిలోని భట్టుపల్లి, మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. 

లంబాడీలకు గుడుంబా పోస్తే చాలట.. 

కాంగ్రెస్ నేతలు రైతుబంధు, 24 గంటల కరెంట్ వద్దంటున్నరని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ‘‘ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రైతుబంధు వేస్ట్, దుబారా అని అంటున్నడు. రేవంత్ రెడ్డి.. మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. ప్రజలకు ఏదీ వద్దు.. తామే పంచుకుని తినాలి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల వైఖరి ఉంది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీమ్, కరెంటు కాటగలుస్తది. కైలాసంల పెద్దపాము మింగినట్లయితది. లంబాడోళ్లకు వెయ్యి రూపాయలిచ్చి, గుడుంబా పోస్తే చాలని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. ఇదేనా లంబాడీలకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద. ఇంత అహంకారంతో మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎవరికి న్యాయం చేస్తది” అని ప్రశ్నించారు.   

తుమ్మల.. జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చేసిండు.. 

తాను అన్యాయం చేశానని మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘తుమ్మల ఖమ్మంలో అజయ్ చేతిలో ఓడిపోయి ఇంట్లో మూలకు కూర్చుంటే.. మా ప్రభుత్వం వచ్చినంక పాత పరిచయంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన. పాలేరులో రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే ఆయన సతీమణిని ఉప ఎన్నికలో నిలబెడదామని అనుకున్న. కానీ ‘అన్నా.. నేను పోటీ చేస్త. పాలేరు ప్రజలకు సేవ చేసుకుంటా’ అని తుమ్మల అంటే ఉప ఎన్నికలో టికెట్ ఇచ్చిన. ఆయనను మీరంతా ఆశీర్వదిస్తే 40 నుంచి 42 వేల ఓట్ల మెజార్టీతో గెలిసిండు. ఓడిపోయిన నిన్ను ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసి ఐదేండ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే.. నువ్వు చేసిందేంది. జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా జేసినవ్. బీఆర్ఎస్ కు నువ్వు చేసింది గుండుసున్నా” అని తుమ్మలపై ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిండా, తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా.. మీరే చెప్పాలె. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, అరాచకం. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది ప్రజలే” అని అన్నారు. 

రైతుబంధు పుట్టించిందే నేను.. 

రైతుబంధు, దళితబంధు పదాలను పుట్టించిందే తాను అని కేసీఆర్ చెప్పారు. ‘‘అంతకుముందు ఏ బంధు లేదు. అంతా మింగుడు బందే ఉండేది. రైతుబంధు పథకాన్ని స్వామినాథన్‍, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు  ప్రశంసించారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం వస్తే ధరణి తీసేస్తామంటున్నరు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది. రూ.10 వేలల్లో 3 వేలు లంచం ఇయ్యల్నా?’’ అని ప్రశ్నించారు. వరంగల్​లో రింగురోడ్‍ కోసం ల్యాండ్‍ పూలింగ్‍ చేస్తారని కొందరు దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పూలింగ్‍, బీలింగ్‍ ఉండదని.. ఎవరి జాగాకు నష్టం ఉండదని స్పష్టం చేశారు. ‘‘ఎలక్షన్ల కోసం అగాథం జగన్నాథం హామీలు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో క్వాలిటీ రావాలి. ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టే చైతన్యం రావాలి. ఎవడో చెప్పిండని ఓటెయ్యవద్దు. వాస్తవం చూసి నిర్ణయం తీసుకోవాలి” అని ప్రజలకు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు.