బాన్స్​వాడపై సీఎం వరాల జల్లు

బీర్కుర్/బాన్స్​వాడ/వెలుగు : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్స్​వాడ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్​వరాల జల్లు కురిపించారు. బుధవారం నియోజక వర్గంలోని ఆధ్యాత్మిక వేడుకకు హాజరైన ఆయన  స్పీకర్​పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. మధ్యాహ్నం12 గంటలకు జిల్లాకు చేరుకున్న సీఎం తిరిగి సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోయారు. మొత్తం 4 గంటల పాటు జిల్లాలో ఉన్నారు.  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి కూడా సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. 

వెంకటేశ్వరుడి కల్యాణంలో  సీఎం దంపతులు..

తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన  బీర్కూర్​ మండలం తిమ్మాపూర్​లోని గుట్టపైన వెంకటేశ్వర స్వామి కల్యాణంలో సీఎం కేసీఆర్​ దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం హైదరాబాద్​నుంచి హెలికాప్టర్​లో బాన్స్​వాడకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులో  తిమ్మాపూర్​కు వచ్చారు. దారి మధ్యలో మహిళలు,  పార్టీ కార్యకర్తలు, స్టూడెంట్లు పూలు చల్లుతూ కేసీఆర్​కు స్వాగతం పలికారు.  సీఎం పక్కన పోచారం శ్రీనివాస్​రెడ్డి  కూర్చొని దారి వెంట జిల్లాలోని అభివృద్ధి పనులు, పంట పొలాలను చూపించారు.  కొండ వద్ద రూ.23 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైలాన్​ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం  స్వామి వారికి పూజలు చేసి  కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అర గంటకు పైగా ఆలయంలో  గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి  కృతజ్ఞత సభకు వచ్చారు.  ఈ సందర్భంగా బాన్స్​వాడ నియోజక వర్గానికి  సీడీఎఫ్​ నుంచి రూ.57 కోట్లు  శాంక్షన్​ చేశారు. టెంపుల్​ వద్ద మిలిగిపోయిన పనులు చేపట్టడానికి రూ. 7 కోట్లు  శాంక్షన్​చేస్తున్నట్లు ప్రకటించారు. 67 ఎకరాల స్థలాన్ని  టెంపుల్​కు కేటాయిస్తూ జీవో జారీ చేశారని  స్పీకర్​ తెలిపారు.  అనంతరం  తిమ్మాపూర్​ నుంచి  బస్సులో   బాన్స్​వాడలోని పోచారం శ్రీనివాస్​రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ అరగంట పాటు గడిపారు. సాయంత్రం 4 గంటలకు హెలి కాప్టర్​లో హైదరాబాద్​కు  వెళ్లారు. 

ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్​ శ్రేణులు

హెలీపాడ్​ వద్ద సీఎం కేసీఆర్​కు  ఉమ్మడి నిజామాబాద్​జిల్లా ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.   ప్రోగ్రాంలో స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, ఎంపీలు  బీబీపాటిల్​, కేఆర్​. సురేశ్​రెడ్డి,  ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​,  ఆర్టీసీ చైర్మన్​బాజిరెడ్డి గోవర్ధన్​, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జీవన్ రెడ్డి, షకీల్, గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీలు వీజీగౌడ్​, రాజేశ్వర్​,  జడ్పీ చైర్మన్​దఫేదర్​ శోభ,  విఠల్​రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్​ముజీబుద్దీన్​, డీసీసీబీ చైర్మన్​పోచారం భాస్కర్​రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

భారీ బందోబస్తు

సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   పలు జిల్లాల నుంచి వెయ్యి మందితో  పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.