
- నిజాం లెక్కనే కేసీఆర్‌నూ తరిమికొడ్తరు
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, ఆక్రమణలే
- లిక్కర్ సేల్స్‌లో తప్ప ఎందులోనూ నం.1 కాదు
- కేసీఆర్‌కు మిగిలింది దింపుడు కల్లం ఆశలే
- 30 లక్షల మంది నిరుద్యోగులను ముంచిండు
- కాళేశ్వరం పేరిట కోట్లు మింగిండు.. అందర్నీ వంచించిండు
- కవిత ఓడినా మూణ్నెల్లకే పదవి.. మళ్లొస్తే మనుమడికీ ఇస్తడు
- గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులపై మాకు క్లారిటీ ఉంది
- కాంగ్రెస్‌లో ఎవరు సీఎం అయినా నాకు ఓకే
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్‌కు ఊహించనంత స్పందన వస్తున్నదని, కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎవరిని అడిగినా ఈసారి కేసీఆర్‌ను ఓడించుడు పక్కా అని అంటున్నారని, మళ్లీ ఆయన వస్తే బతకలేమన్న భావన వాళ్లలో నెలకొందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కాదు.. సునామీనే వస్తుందని, అందులో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం వీ6 నిర్వహించిన ‘లీడర్స్ టైమ్’లో రేవంత్ పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది వివరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు జనంలో మంచి ఆదరణ లభిస్తున్నదని అన్నారు.
20 ఏండ్ల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని, ఇంతటి ఊపు ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
తెలంగాణ ఉద్యమానిది ఒక రకమైన భావోద్వేగమైతే.. ఇప్పుడు ప్రజల్లో వస్తున్నది మరో రకమైన భావోద్వేగమని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు మిగిలింది దింపుడుకల్లం ఆశలేనని, ప్రచార సభల్లో ఆయన ప్రసంగాలు వింటుంటేనే అర్థమైపోతుందని అన్నారు.
తనలాంటి లీడర్‌ను వదులుకోవద్దని కేసీఆరే స్వయంగా చెప్తున్నరు.. మరి, జనం వదులుకుంటరా?
కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఆయనే రెండుసార్లు ప్రజలను వదిలించుకున్నరు. ఆయనే రాష్ట్రాన్ని వదిలించుకున్నరు. కేసీఆరే తెలంగాణను పార్టీ నుంచి తొలగించి తెలంగాణతో పని లేదన్నరు. ఆయనే మహారాష్ట్ర, కర్నాటక, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఆయనే తెలంగాణ ప్రజలతో బంధం, కమిట్మెంట్ను తెంపేసుకుని వెళ్లిపోయారు. ఆయన తిరిగొచ్చినా కూడా.. ప్రజలను భయపెట్టడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నడు. అది సాధ్యం కాదు.
కేసీఆర్‌ను వదులుకోకపోవడం అనేది కేసీఆర్ కుటుంబానికే కావాలి. కానీ, ప్రజలకు కేసీఆర్‌తో ఎలాంటి సంబంధం లేదు. అసలు కేసీఆర్‌ను ఎందుకు వదులుకోవద్దు? తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకా.. 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా.. పేపర్ లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల పొట్టకొట్టినందుకా.. వరదలతో హైదరాబాద్ మునిగినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు దిగమింగి ప్రాజెక్టు కుంగినందుకా.. పోడు పట్టాలిస్తామని చెప్పి ఇయ్యనందుకా.. దళితుల అసైన్డ్ భూములను ధరణి పేరుమీద గుంజుకున్నందుకా.. ఓఆర్ఆర్ను పల్లీలలెక్క అమ్ముకున్నందుకా.. రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని అక్రమ అనుమతులు ఇస్తున్నందుకా.. ఇంట్లో వాళ్లకే పదవులిచ్చినందుకా.. ఎమ్మెల్యేల ల్యాండ్, సాండ్, వైన్, మైన్మాఫియా తయారు చేసినందుకా.
3,000 వైన్ షాపులు, 18 వేల బారు షాపులు, 62 వేల బెల్టు షాపులు తెచ్చి దేశంలో తెలంగాణను తాగుడులో నంబర్ వన్ చేసినందుకా.. ఎందుకు కేసీఆర్‌ను వదులుకోవద్దు?! కూతురు, బంధువు ఓడిపోతే మూడునెలలు కూడా కాకముందే పదవులు కట్టబెట్టిండు. మూడోసారి కేసీఆర్ సీఎం అయితే.. మళ్లీ తన కుటుంబానికే మంచి చేస్తడు. అవసరమైతే మనుమడినీ మంత్రిని చేస్తడు. పదేండ్లలో ఏమీ చేయనిది.. వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తడు?!
కేసీఆర్ ఈ పదేండ్లలో ఏమీ చేయలేదా?
ఈ పదేండ్లలో కేసీఆర్ ఏం చేశారు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని ఇచ్చారు..? మేం 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినం. వాళ్లేమో 2 లక్షల ఇండ్లు ఇచ్చినమంటున్నరు. దానికి సరైన లెక్కలు కూడా లేవు. అందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినకాడ వాళ్లు ఓట్లు అడిగితే.. ఇందిరమ్మ ఇండ్ల కాడ మేం ఓట్లు అడుగుతమని సవాల్ విసిరిన. వాళ్లు వెనక్కు పోయిన్రు కదా. బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇస్తే.. వాటిని భర్తీ చేయలేదు.
విభజన హామీలైన ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తెచ్చారా? పవర్ ప్రాజెక్టులు కట్టారా? మేం చట్టం చేసినా.. దానిని తీసుకురాలేకపోయారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగి ఉంది కదా. మేం తీసుకొచ్చిన ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి రీడిజైన్ చేసి.. లక్ష కోట్లు కొల్లగొట్టిండు. మేం పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసినం. కేసీఆర్ టెండర్లు పిలిచి కమీషన్లు నొక్కేసి పక్కనపెట్టిండు. మేం తెచ్చిన ప్రాజెక్టులనే కొనసాగించి పెండింగ్ పెట్టారు. ఆయన ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? మేం ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించినం. ఐటీ కంపెనీలు తెచ్చామని మేం చెప్తం.
చంద్రబాబు ఏం చేశాడంటే హైటెక్ సిటీని కట్టించారని చెప్తరు. హైదరాబాద్‌లో మత కలహాలు లేకుండా శాంతియుతంగా పెట్టుబడులు తీసుకొచ్చామని మేం చెప్పుకోగలం. కేటీఆర్ సెల్ఫీలు దిగే నెక్లెస్‌రోడ్, శిల్పారామాలు కూడా మేం కట్టినవే. కానీ, కేసీఆర్‌ను అడిగితే రూ. 2,000 కోట్లతో పది ఎకరాల్లో 150 బెడ్రూంలతో ప్రగతి భవన్ కట్టుకున్నమని చెప్తరు. కేసీఆర్ బుద్ధి వక్రంగా ఉంది కాబట్టి వాస్తు పేరు మీద పాత సెక్రటేరియెట్‌ను కూలగొట్టి..
కొత్త సెక్రటేరియెట్‌ను కట్టుకున్నమని ఆయన పిచ్చికి తగ్గట్టు చెప్పుకోగలరు తప్ప.. ప్రజలకు ఉపయోగపడేది, ఆదాయాన్ని తెచ్చి పెట్టేది ఏమైనా చేశారా? మేం నిర్మించిన హైటెక్ సిటీలో డ్రైనేజీలను కూడా కేసీఆర్ కట్టలేకపోయారు. రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం వచ్చింది.. పదేండ్లలో రూ.17 లక్షల కోట్ల బడ్జెట్‌ను పెట్టారు. దానికి అదనంగా రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేశారు. మరి, అన్ని పైసలు ఎక్కడికి పోయాయి. స్వేచ్ఛను హరించడం, సామాజిక న్యాయం లేకపోవడం, సమానత్వం లేదు. ఇదే తెలంగాణలో జరిగింది.
మీ ఆరు గ్యారెంటీలు ఇంటింటికీ చేరాయా?
ఆరు గ్యారెంటీలు ప్రజల గుండెలకు చేరుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. మీడియా ప్రశ్నించగలదు. సమస్యలను లేవనెత్తి చూపించగలరు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే నిరసన చేసుకునే అవకాశం ఉంటుంది. ధర్నాచౌక్ ఓపెన్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ప్రజాస్వామ్యం. కేసీఆర్, బీఆర్ఎస్ లీడర్లు నిజంగానే అభివృద్ధి, మంచి చేసుంటే.. వాటిని చెప్పుకుని ఓట్లు అడగొచ్చు కదా. మరి, కాంగ్రెస్‌పై నెగెటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నరు? ఉమ్మడి పాలనలో సీమాంధ్ర పాలకులు ఏం చెప్పెటోళ్లు.. కేసీఆర్ అదే చెప్తున్నడు. ప్రజలను భయపెట్టి బతకాలనుకుంటున్నడు. భయపెట్టి రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచాలని ఉమ్మడి పాలకులు అన్నరు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నదదే.
కరెంట్, ధరణి, రైతుబంధు విషయంలో కాంగ్రెస్‌పై కేసీఆర్ చేస్తున్న విమర్శలకు మీరేమంటారు?
ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్‌ది.. 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా రైతుల మీద పెట్టిన వేలాది కేసులను కొట్టేయించాం. రూ.1,200 కోట్ల బకాయిలను ఒక్క సంతకంతోనే మాఫీ చేశాం. ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనగానే వైఎస్ గుర్తొస్తారు. ఏ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనూ తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేయలేవు. రైతుబంధును మేమెందుకు రద్దు చేస్తం. 2014లో మా ఎన్నికల మేనిఫెస్టోలోనే మేం పెట్టాం.
అప్పుడు మేం అధికారంలోకి రాలేదు కాబట్టి.. అమలు చేయలేకపోయాం. 2018లో ఆ పథకాన్నే కేసీఆర్ కాపీ కొట్టి అమలు చేశారు. ప్రభుత్వ పథకాల పైసలతోటి ఎన్నికల్లో ఓట్లు పొందాలని కేసీఆర్ చూస్తున్నడు. మేం రైతు భరోసా కింద రూ.15 వేలు ఎకరాకు ఇస్తాం. కౌలు రైతులకూ అమలు చేస్తాం. ఉపాధి కూలీలకూ ఆర్థిక సాయం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ అన్నీ రైతులకు అందిస్తాం. కేసీఆర్ వాటన్నింటినీ రద్దు చేశారు. ఈ ప్రభుత్వం రైతు చచ్చిపోతే బీమా అంటున్నది..రైతు చావు కోరుకుంటామా మనం.. పంట నష్టపోతే పంటబీమా పథకం అమలు చేసి బతుకు కోరాలి. బీఆర్ఎస్ సర్కార్ వేల మంది రైతులను ఈ పదేండ్లలో పొట్టనపెట్టుకున్నది.
సునామీ అంటున్నరు.. నిజంగా వస్తుందా?
రేవంత్: కచ్చితంగా వస్తుంది. వేవ్ అని నేను అనను.. వేవ్ అంటే చిన్నదైపోతుంది. అందుకే సునామీనే అని అంటున్న. ప్రజల్లో కేసీఆర్ పాలనపై ఆక్రోశం, ఆవేశం కనిపిస్తున్నది. 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉన్న యూత్‌లో ఆ ఊపు ఎక్కువున్నది. కేసీఆర్‌ను గద్దె దించాలన్న కసి కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో యువత ఎట్లయితే కసిగా పోరాడారో.. ఇప్పుడు కూడా యువత అదే రీతిలో ఉన్నరు. బాగా మోసపోయినప్పుడు వచ్చే కసి కండ్లలో కనిపిస్తుంది. ఇప్పుడు యువతలో ఆ కసి కనిపిస్తున్నది. వారిని చూస్తుంటే.. ఈసారి కేసీఆర్‌ను ఓడిస్తామన్న ధీమా కలుగుతున్నది. ఇది కచ్చితంగా జనం ఇచ్చిన కాన్ఫిడెన్సే. కేసీఆర్ డబ్బులతో మాయ చేస్తడని కొందరు లీడర్లు అనుకుంటున్నా.. నిరుద్యోగులు, రైతులు మాత్రం చాలా క్లియర్‌గా ఉన్నరు. కేసీఆర్‌ను దించాల్సిందే అంటున్నరు. పదిలో ఏడుగురు కాంగ్రెస్‌కే ఓటేస్తమంటున్నరు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే... ఆ రెండు కవల పిల్లలు. కాంగ్రెస్ పార్టీకే జనం ఓటేస్తమంటున్నరు.
కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువ అన్న అపవాదు ఉంది. దీనిపై ఏమంటారు?
మా పార్టీలో 80 మంది సీఎం అభ్యర్థులే ఉన్నరు. పది కాదు.. గెలిచినోళ్లంతా సీఎం క్యాండిడేట్లే అనుకుంటే మొదట సంతోషపడే వ్యక్తిని నేను. పార్టీలో ఎవరిని సీఎం చేసినా నాకు ఓకే. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీనే అధికారం చేపడుతుంది.
మీ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎందుకు లేటైంది?
అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని మేం ఓ పాచిక వదిలినం. దాన్ని నమ్మేసి కేసీఆర్ మొత్తం అభ్యర్థులను ప్రకటించేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఊర్లలోకి వెళ్తే మొహంపై జనం కొడ్తున్నరు. అభ్యర్థులను లేట్‌గా ప్రకటించడం మా వ్యూహం. కేసీఆర్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకే మా ఈ వ్యూహం. రైతు డిక్లరేషన్ ద్వారా ఏడాదిన్నర క్రితమే మా మేనిఫెస్టోను మేం విడుదల చేసేశాం. అందరితో కలిసి చర్చించాకే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం. ముందే అభ్యర్థులను ప్రిపేర్ చేశాం. వారు ఇల్లిల్లు తిరిగారు. అందరికీ నోటెడ్ అయ్యారు. వారికే టికెట్లు ఇచ్చాం.
కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలుస్తుందా? ఆరు గ్యారెంటీలతో గెలుస్తుందా?
తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ సంక్షేమం మొదటి ప్రాధాన్యం కాదు. వారికి అది రెండో ప్రాధాన్యం. ఉమ్మడి ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. అయినా తెలంగాణను ఎందుకు అడిగారు? హైదరాబాద్ స్టేట్‌లో నిజాంలు ఎన్నో యూనివర్సిటీలు కట్టారు.. సిటీని డెవలప్ చేశారు. నిమ్స్, అసెంబ్లీ, సెక్రటేరియెట్, గండిపేట, హిమాయత్‌సాగర్ వంటివన్నీ నిజామే నిర్మించిండు కదా. అయినా నిజాం నుంచి జనం విముక్తి కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వాన్ని కోరుకుంటారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తామనేటోళ్లు.. ప్రజలను బానిసలుగా చూద్దామనుకుంటే ఇక్కడి జనం క్షమించరు.
అప్పట్లో గ్రామాల్లో వెట్టి చాకిరి ఉంటుండే.. గ్రామాల్లో జనాల పిల్లలు తరాలకొద్దీ దొరల వద్ద ఊడిగం చేస్తుండే.. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రజల నుంచి అలాంటి వెట్టిచాకిరి ఆశిస్తున్నడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుంటే.. కేసీఆరేమో గొర్లు పెంచుకోండి, బర్లు కాసుకోండి.. అని చెప్తున్నడు. వాళ్లను కేవలం కుల వృత్తులకే పరిమితం చేసి.. ఆయన, ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలాలనుకుంటున్నరు. గతంలో ఏపీ పాలకులు, నిజాంలను ఇందుకే కదా తరిమికొట్టింది. వాళ్లను తరిమినోళ్లను ప్రజలు.. కేసీఆర్‌ను మాత్రం ఎందుకు తరమరు. ప్రగతిభవన్, సెక్రటేరియెట్‌లోకి ప్రజలను కేసీఆర్ ఎందుకు అనుమతించరు?
యువతకు గద్దర్ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తినే ప్రగతిభవన్ గేట్ల వద్ద కూర్చోబెట్టడం న్యాయమా? కోదండరాంను తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం దేనికి సంకేతం? అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో ఎప్పుడైనా కేసీఆర్ పాల్గొన్నడా? ఇప్పుడు ప్రజలు ఊరుకోరు కాబట్టి.. అంబేద్కర్‌కు దండేసి దండం పెట్టుకుంటున్నడు. విగ్రహం పెట్టినంత మాత్రాన జనం అన్నీ మరిచిపోతరా?
రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అలాంటప్పుడు మీ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమా?
ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఏటా రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం ఉన్నది. మరో 15 శాతం పెరిగే అవకాశం ఉంది. మా గ్యారెంటీలకు రూ.68 వేల కోట్లు ఏటా అవసరం అవుతాయి. అన్నీ బేరీజు వేసుకుని ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందని లెక్క వేసుకుని గ్యారెంటీలను ప్రకటించాం. రూరల్ హెల్త్ మీద కేంద్రం 70 శాతం నిధులిస్తుంది. ప్రాజెక్టులు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివన్నింటికీ కేంద్రం గ్రాంట్స్ ఇస్తుంది.
కానీ, కేసీఆర్ ఒక్కసారి కూడా కేంద్రానికి ప్రపోజల్స్ పంపలేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాల్సిందే.. కానీ, లైలామజ్నుల్లెక్క కౌగిలించుకుని ప్రేమించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. మేం ఆదాయాన్ని పెంచుతాం.. పేదలకు పంచుతాం.. ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం.