
- ఏడాదిలో వికారాబాద్‌కు నీళ్లు తెస్త:
- కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యంకాని హామీలు
- వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూమేత
- కబ్జాకోర్ కాంగ్రెస్ రాజ్యంలోనే సిటీలో చెరువులు, నాలాల సమస్య
- పటాన్చెరును కాలుష్య రహితంగా మారుస్తమని హామీ
- వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు, మహేశ్వరంలో సభలు
వికారాబాద్, బడంగ్‌పేట, సంగారెడ్డి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని.. ఇక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో కొన్ని పనులు మిగిలాయని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాదిలో కాలువలు పూర్తి చేసి వికారాబాద్, చేవేళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు పాలమూరు నీళ్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గురువారం వికారాబాద్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, పటాన్చెరు లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిపోయింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ నాయకుల వల్లే పూర్తి కాలేదు. ఆ పార్టీ వాళ్లు 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేశారు. అయినా ప్రాజెక్టు దాదాపు పూర్తి చేసినం.. కాలువలు తవ్వాల్సి ఉంది అంతే. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల నియోజకవర్గాలకు పాలమూరు ప్రాజెక్టులో వాటా ఉంది. ఒక్క ఏడాదిలో మీ వాటా నీళ్లు మీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఒక్కసారి ఆ నీళ్లు వచ్చినయంటే.. వికారాబాద్ భూములు ప్రత్యేకమైనవి మంచి కమర్షియల్ పంటలు పండుతయ్. మీరు బంగారం పండిస్తరు. చాలా అద్భుతంగా మీరంతా చాలా పైకి పోతరు” అని కేసీఆర్ అన్నారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలోనే చేసిందని చెప్పారు. అనంతగిరి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
సబ్స్టేషన్లు కాలిపోతయ్
వ్యవసాయ బావులకు 10 హెచ్‌పీ మోటార్లు పెడితే ట్రాన్స్‌ఫార్మర్లు పటాకులు పేలినట్లు పేలుతాయని, సబ్ స్టేషన్లు కాలిపోతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తమని,10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని అంటున్నారని, ఆయనది తెలివి తక్కువ తనమని దుయ్యబట్టారు. కాంగ్రెస్నేతలది కొంపలగుత్త వ్యవహారమని మండిపడ్డారు. ఇంకా డేంజర్‌గా ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తమంటున్నరని విమర్శించారు. వాళ్లు తెచ్చేది భూమతానా? భూమేతనా? అన్ని ప్రశ్నించారు. మళ్ల పట్వారీ వ్యవవస్థను తీసుకొస్తామని భట్టి విక్రమార్క చెప్తున్నారు.
కర్నాటక ప్రజలకు పట్టిన గతే
ఆచరణకు సాధ్యం కానీ హామీలిస్తున్న కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే కర్నాటక ప్రజలకు పట్టిన గతే తెలంగాణకు పడుతుందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల టైంలో పనికిమాలిన వాగ్దానాలు చేయడం, లొల్లి పెట్టడం, చేతకాని మాటలు చెప్పడం కాంగ్రెస్ కు అలవాటైందన్నారు. పదేండ్ల కింద కాంగ్రెస్ పాలనతో బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసి ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని సూచించారు.
నాలాలు, చెరువుల సమస్య తీర్చినం
బడంగ్‌పేట్, జల్‌పల్లి, మీర్‌పేట, తుక్కుగూడలో పెద్ద సమస్య ఉండేదని, అది దగాకోరు, కబ్జాకోరు కాంగ్రెస్ రాజ్యం సృష్టించిన సమస్యని కేసీఆర్ అన్నారు. ‘‘వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు చెరువుల కిందకు నీళ్లు వదిలితే కింద ఏరియాలు కొట్టుకుపోయే పరిస్థితి.. నీళ్లు విడువకపోతే మీద కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉండేది. రూ.1000 కోట్లతో సిటీ సబర్బన్ ఏరియాలో నాలా డెలవప్‌మెంట్ ప్రోగ్రామ్ అమలు చేసి ఆ ప్రాబ్లం తీర్చినం” అని వివరించారు. రూ.670 కోట్లతో హైదరాబాద్ శివారు ప్రాతాలకు తాటునీటి బాధలు తీర్చామని చెప్పారు. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రత్యేక పైపు లైన్ వేస్తమని..దాంతో సిటీకి శాశ్వతంగా మంచి నీటి బాధలు తీరుతాయని తెలిపారు.
పటాన్ చెరులో గెలిస్తేనే అధికారంలోకి
పటాన్ చెరులో ఏ పార్టీ గెలుస్తదో ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తదని కేసీఆర్ అన్నారు. పటాన్ చెరుకు అంతటి ప్రాధాన్యత ఉందన్నారు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కాలుష్యంతో నిండిన పటాన్ చెరును కాలుష్య రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు మెట్రో రైలు తీసుకొస్తామన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.