తెలంగాణ లాగానే దేశాన్ని బాగు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకువస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. హంసలాగా పాలను పాలు, నీళ్లను నీళ్లుగా వేరు చెయ్యాలని చెప్పారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పేందుకు మునుగోడు ప్రజలకు మహత్తర అవకాశం దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పునాది రాయి మునుగోడే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడును తన గుండెల్లో పెట్టుకుంటానని చండూరు బహిరంగ సభలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఓటు వేసే ప్రతి ఒక్కరూ నేను చెప్పేది గుర్తు పెట్టుకోండన్న కేసీఆర్.. పని చేసేటోళ్లను గెలిపించుకుంటే మీ తలరాతలు మారతాయని చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. మీ రోడ్లు తళ తళలాడేటట్టు చేస్తానని మునుగోడు ప్రజలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో ప్రభాకర్ రెడ్డిని ఓడించి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అందుకే మునుగోడులో రోడ్లు సరిగా లేవన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లు ప్రజలకు ఏమి చేయకుండా.. తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తో ఢిల్లీ పీఠమే కదిలేలా చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.