
కాంగ్రెస్ పార్టీ వల్లే మనం ఎంతో అన్యాయానికి గురయ్యామని మరోసారి సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను గమనించాలని.. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని అన్నారు. ఎన్నికలు వస్తాయి..పోతాయి.. కాని చివరకు ప్రజలే గెలవాలన్నారు.
ఆసిఫాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పారు. బీఆర్ఎస్ పోరాటానికి భయపడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ వచ్చాక రైతుల ముఖచిత్రాలే మారిపోయాయని చెప్పారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల కోసం గురుకులాలు పెట్టుకున్నామని రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి సమస్య లేదని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతుల కుటుంబాలను ఆదుకున్నామన్నారు. ఉచిత కరెంట్, రైతుబంధు, ధరణి వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే, తెలంగాణలో కరెంట్,నీళ్ల కష్టాలు వస్తాయన్నారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని... తెలంగాణ తెచ్చుకోవడం వల్లే ఆసిఫాబాద్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ, వందల పడకలతో ఆస్పత్రి వచ్చాయి. జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన కుమురం భీం పేరునే జిల్లాకు పెట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ లో వేల సంఖ్యలో పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. మాలి కులస్తుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఆగం అయితది కాబట్టి.. బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆసిఫాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవ లక్ష్మీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యాం నాయక్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అజ్మేరా ఆత్మారామ్ నాయక్ లు పోటీ చేస్తున్నారు.