నేనే వచ్చి.. సీతారామా ప్రాజెక్టు ప్రారంభిస్తా: సీఎం కేసీఆర్

ప్రజాస్వామ్యంలో పరిణితి రావాల్సిన అవసరం ఉందని... మన దేశంలో ఇంకా పరిణితి రాలేదని.. ప్రపంచంలో ఎక్కడ పరిణితి వచ్చిందో.. ఆ దేశాలు అభివృద్ధి చెందాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం(నవంబర్ 5) భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

 ఎన్నికలు వస్తే ఆగమాగం..గత్తర గత్తర అయిపోతామని... ఎన్నికల్లో  ప్రజలే గెలవాలని అన్నారు. ఎన్నికల్లో నిలబడే నాయకుడి గుణగణాలే కాదు.. ఆ వ్యక్తి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో..  ఆ పార్టీ చిరిత్ర, సిద్ధాంతం తెలుసుకుని ఓటేయ్యాలని చెప్పారు.

 సింగరేణి గనుల.. తెలంగాణ కొంగు బంగారమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదని.. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని లాభాల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో సింగరేణి కార్మికుడు చనిపోతే ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారని.. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి అప్పు తీర్చలేదని.. సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు.

కొత్తగూడెం జిల్లా కావడమే కాదు.. ప్రభుత్వ వైద్య కళాశాల కూడా వచ్చిందని తెలిపారు.  కొత్తగూడెంలో 13,500 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని తెలిపారు. సింగరేణిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు.సింగరేణి పరిధిలో 22వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు.  

దళితజాతి తరతరాల నుంచి వివక్షకు గురైన జాతి అని, వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా..  వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతి దళిత వ్యక్తికి దళిత బంధు అందే వరకు పథకాన్ని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదని చెప్పారు. సీతారామా ప్రాజెక్టు 70 శాతం పూర్తి అయ్యిందని.. రాష్ట్రంలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టేనని.. తానే వచ్చి సీతారామా ప్రాజెక్టు ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సీఎం కోరారు.