ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పారు. నిలబడే అభ్యర్థి ఎవరు.. పార్టీ చరిత్ర ఎంటో తెలుసుకోవాలన్నారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ప్రజలు గమనించాలని కోరారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధం ఓటేనని కేసీఆర్ చెప్పారు.
తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే కార్యక్రమం అమలు చేశానని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే దళిత బంధుకు స్ఫూర్తి అని చెప్పుకోచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశామని, ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చుంటే మేనిఫెస్టోలో పెట్టేవాళ్లమన్నారు. హుజురాబాద్ లో వందశాతం దళిత బంధు అమలు చేశామన్న కేసీఆర్... ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక మండలం మొత్తం దళితబంధు ఇచ్చామన్నారు. కేసీఆర్ కంటే ముందు ఎవరైనా దళిత బంధు గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు.
- ALSO READ | మళ్లీ బీఆర్ఎస్లో చేరిన రామ్మోహన్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలవనీయమని కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. నాలుగు పైసలు ఎక్కువుంటే అంత అహంకారం అవసరమా అని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్న కేసీఆర్.. ధరణి ఉంటేనే రైతులను ఎవరూ మోసం చేయరని చెప్పారు.