సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్షాల అసమర్థతను తూర్పారబడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ..బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సోమవారం ( అక్టోబర్ 30) జుక్కల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం కేసీఆర్ జుక్కల్ సభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వరు.. కరంట్ అసలు ఉండదని జుక్కల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నార. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసిందని ఆరోపించారు. తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తర్వాతే.. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాల్లో మంచి నీటికి ఎంతో సమస్య ఉండేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలని.. మహారాష్ట్రలో ఇప్పటికీ రోజుకు 8 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో తప్ప.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ లేదని వెల్లడించారు. రైతుబంధు పేరుతో ప్రజల డబ్బు వృథా చేస్తున్నానని విపక్ష నేతలు అంటున్నారని మండిపడ్డారు. రెండు దఫాల్లో 37 వేల కోట్ల రూపాయిలు రుణమాఫీ చేసుకున్నామన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని కేసీఆర్ వెల్లడించారు.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు, రైతు బంధు ఉండదని హెచ్చరించారు.