కాంగ్రెస్ పాలనలో దళారిలదే రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం అని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తన కంటే పొడుగు, దొడ్డు ఉన్న ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు.. చాలా మంది మంత్రులు అయ్యారని..కానీ వాళ్లు ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. అలాగే తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు తెచ్చామని చెప్పారు.
ధరణి పోర్టల్ ఉండాలా వద్దా..
ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామని కొందరు అంటున్నారని..వారినే బంగాళాఖాతంలో కలిపేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటే....రైతులనే వేసినట్లే అని చెప్పారు. ధరణి పోర్టల్ లేకపోతే రైతు భీమా, రైతు బంధు పథకాలకు ఇబ్బంది అయితదన్నారు. ఒకప్పుడు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అనేక బాధలు ఉండవని...ఇప్పుడు రైతు తన భూమిని ధరణి ద్వారా సులభంగా అమ్ముకుంటున్నారని చెప్పారు. ధరణి ద్వారా 99 శాతం భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. ధరణి లేకపోతే ఎన్ని బాధలు అయితుండే..ఎన్నిపోలీస్ కేసులు అయితుండే..ఎన్ని కొట్లాటలు, మర్డర్లు అయితుండే అని అన్నారు. ధరణిని తీసేసి రైతుల మధ్య మళ్లీ చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ధరణిలో ఏమైనా మార్చాలంటే హక్కుదారునికే ఉంటుందని..ధరణిలో రైతులకే అధికారం ఇచ్చామన్నారు.
పాలమూరు పచ్చవడ్డది..
ఉమ్మడి రాష్ట్రంలో వలసలతో పాలమూరు జిల్లా అల్లాడిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ప్రస్తుతం పాలమూరు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసుకున్నామని..వాటి ద్వారా బ్రహ్మాండంగా చెరువులను అద్భుతంగా చేసుకున్నామన్నారు. మిషన్ కాకతీయ రాక ముందు నాగర్‌కర్నూల్ పాలెం, బిజినేపల్లి వడ్డెమాను చెరువు మురికి తుమ్మలు, లొట్టపీస్ చెట్లతో నిండి ఉండేవన్నారు. ఇవాళ కేసరి సముద్రం ఎలా తయారైందని అడిగారు. కాంగ్రెస్ పాలనలో కేసరి సముద్రంలో కంపసారి చెట్లు ఉండేవని...నేడు సుందరంగా తయారైందన్నారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు వెలిశాడని... జనం వచ్చి చూసివేళ్లె పర్యాటక ప్రాంతంగా కేసరి సముద్రం మారిందంటే తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని తెలిపారు.
పేగు ఎండిపాయెరా...
దుందుబి వాగుపై గతంలో గోరటి వెంకన్న పాట రాశాడని.... ‘పెద్దవాగు ఎండిపాయెరా.. పేగు ఎండిపాయెరా’ అని తన పాటలో బాధపడ్డాడని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం అదే వెంకన్న ..వాగు నిండిపాయెరా.. అని పాడుతున్నడని చెప్పారు. దుందుబి వాగుపై చెక్‌డ్యామ్‌లు కడితే ఎండకాలంలోనే నీళ్లు నిండి ఉన్నాయని... వాటిని చూసి తన కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. ప్రజల బతుకు ముఖ్యం కాబట్టి.. దాని కోసం పోరాడామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండేవని...తెలంగాణ రాకపోతే ఇప్పటికీ ముందట పడకపోవన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చొరవతో అవన్ని స్విచ్ఛాన్ అయ్యి 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకునే దిశగా ముందుకుపోతున్నాయన్నారు. అచ్చంపేట ప్రాంతానికి రూ.2వేలకోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించుకున్నామని... అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతో అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నామన్నారు.
వలసలు వాపస్..
పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్లిన వారంతా వాసప్ వస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ నాడు వలసపోయిన పాలమూరు జిల్లాకు బిహార్, జార్ఖండ్, ఒడిశా, యూపీ నుంచి నాట్లు వేసేందుకు కూలీలు వలస రావడం మనకు గర్వకారణమన్నారు. తెలంగాణలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయన్నారు. పాలమూరు గ్రామాల్లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బొడ్రాయి పండగ చేసుకుంటున్నారంటే గుండెల నిండా సంతోషపడ్డామన్నారు.