ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. సిర్పూర్‌లో జరిగిన జా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. పార్టీలకు, అభ్యర్థులకు ఓ చరిత్ర ఉంటుందని దానిని ప్రజలు గమనించాలని తెలిపారు. రైతులు, పేదల గురించి ఆలోచించే వారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఓటుకు ఎంతో విలువ ఉంటుందని, ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక్క అయుధం ఓటుని సీఎం అన్నారు.
కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించిందనన్నారు. బీఆర్ఎస్ పోరాటానికి భయపడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని చెప్పారు.
తెలంగాణ వచ్చాక రైతుల ముఖచిత్రాలే మారిపోయాయని చెప్పారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల కోసం గురుకులాలు పెట్టుకున్నామని రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి సమస్య లేదని తెలిపారు.