
- ఎన్నికల టైమ్‌లో అడుక్కుతినెటోళ్లు చాలా మంది వస్తరు
- ఆగమాగం కావొద్దు.. మోసకార్ల మాటలు నమ్మొద్దు
మెదక్, వెలుగు: రైతులకు మేలు చేసేందుకే ధరణి తీసుకొచ్చినం, ధరణి పోతే కైలాసంలో పెద్ద పాము మింగినట్టే ఐతది. అధికారంలోకొస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అంటున్నది. ధరణి వద్దనెటోళ్లను బంగాళాఖాతంలో కలపాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నయనంగానే వడ్ల కల్లాల దగ్గరికి అడుక్కుతినెటోళ్లు వచ్చినట్లు చాలా మంది వస్తారని, ఆగమాగం కావొద్దని చెప్పారు.
మోసకార్ల మాటలు నమ్మితే గోస పడ్తం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దుర్మార్గులు, చేతగాని వాళ్లకు అప్పజెప్పొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు ధీరత్వాన్ని ప్రదర్శించాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం మెదక్ లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రగతి శంఖారావం సభలో మాట్లాడారు. ‘‘ఇంతకు ముందు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సద్దులు కట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కాడ పడిగాపులు కాయాల్సి వచ్చేది. దక్షిణ సమర్పిస్తేగాని పని అయ్యేది కాదు. ధరణి వచ్చాక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్‌తోపాటు, మ్యుటేషన్ కూడా అయిపోతున్నది’’ అని పేర్కొన్నారు.
రైతుబంధు పైసలు, వడ్లు అమ్మిన పైసలు ధరణి వల్ల నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పారు. రైతు బీమా వంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదని అన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దు, కరోనా వల్ల రుణమాఫీ ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం. ఇప్పటి వరకు 37 వేల కోట్ల రుణమాఫీ చేసినం. మహారాష్ట్ర రైతులందరూ కూడా బీఆర్ఎస్‌ను గెలిపిస్తమని అంటున్నరు” అని ఆయన తెలిపారు.
కాంగ్రెసోళ్లు అప్పుడు ఏం చేసిన్రు?
‘‘కాంగ్రెస్ నాయకులు ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్నరు. ఒక్క చాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. అప్పుడు ఏం చేసిన్రు? 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మంచినీళ్ల కష్టాల గురించి కూడా ఆలోచించలేదు’’ అని కేసీఆర్ దుయ్యబట్టారు. మిషన్ భగీరథ వచ్చాక ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి రోజూ నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇండియా మొత్తంలో కోటి 3 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్ల ద్వారా మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ‘‘ఘనపురం ఆయకట్టుకు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఘనపురానికి నీళ్లు కావాలంటే ధర్నాచేయాల్సి వచ్చేది.
కానీ నేను సీఎం అయినంక స్వయంగా ఘనపురం ఆనకట్ట కాడికి పోయి చూసిన. ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడి సర్వే చేపిచ్చి ఆనకట్ట ఎత్తు పెంచుకున్నం. కాల్వలు బాగు చేసుకున్నం. దీంతోని ఇప్పుడు 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు సాగు నీళ్లు అందుతున్నయ్” అని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలకులు సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారని, కానీ ఈ రోజు సింగూర్‌ను మెదక్‌కే డెడికేట్ చేసుకోవడం వల్ల జోగిపేట ప్రాంతంలో కూడా నీళ్లు పారుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఘనపురం ఆయకట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంటలు పండించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరంలో భాగంగా మల్లన్నసాగర్ ద్వారా అవసరమున్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నామన్నారు.
పద్మ పనితనం గుర్తించే టికెట్ ఇచ్చిన
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పనితనం గుర్తించే ఆమెకు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పారు. పోయిన సారికంటే రెట్టింపు మెజారిటీతో ఆమెను గెలిపించాలన్నారు. మెదక్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని సిద్దిపేట లెక్క ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.
రైతు ఆత్మహత్యలు లేవు
‘‘తెలంగాణ రాకముందు రైతులు చెట్టుకొకరు, గుట్ట కొకరు అన్నట్టు ఉండెటోళ్లు. భూమి ఉన్నా కూడా హైదరాబాద్‌కు పోయి ఆటో రిక్షా నడిపుకునెటోళ్లు. తెలంగాణలో రైతును బాగు చేయాలనే సంకల్పంతో కార్యక్రమాలు మొదలుపెట్టినం. కాళేశ్వరం నీళ్లు వస్తున్నయ్. అనేక సమస్యలు పరిష్కారించుకున్నం. ఇప్పుడు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవు. ఇప్పుడిప్పుడే మన రైతుల ముఖాలు తెల్లవడ్తున్నయ్. ఒక్కో ఊరిలో 20, 30, 40 కార్లు అయినయ్. మరో ఆరేడు ఏండ్లల్ల రైతులందరూ బాగుపడ్తరు” అని కేసీఆర్ చెప్పారు.