అసెంబ్లీలో తప్పిన లెక్కలు.. పక్కదోవ పట్టిన నిజాలు

సీఎం కేసీఆర్​బడ్జెట్ ముగింపు సందర్భంగా గంట 40 నిమిషాలు మాట్లాడారు. కానీ ఆయన కంఠంలో సహజంగా ఉండే కేసీఆర్ ట్రేడ్ మార్క్ వాయిస్ వినిపించలేదు. సబ్జెక్టులోనూ బేస్ లేదు. విమర్శించక తప్పదు కాబట్టి ప్రధాని మోడీ మీద విమర్శ తప్ప, మనసులో ఎదో బెంగ ఉన్నది. పార్లమెంటులో మోడీ స్పీచ్​లో చాలెంజ్ కనిపిస్తే, కేసీఆర్ అసెంబ్లీ స్పీచ్​లో ఆత్మ స్థైర్యం లోపించింది. విమర్శిస్తూనే, విజ్ఞప్తి చేస్తున్నట్లు అనిపించింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి, మధ్య మధ్యలో ఈటలకు ఒక స్నేహ హస్తం ఇస్తున్నట్లుగా కనిపించింది. టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా చేసి, రెంటికి చెడ్డ రేవడిగా మారానా అన్న సందేహం ఆయనలో మొదలైనట్లు ఉన్నది. కోట్లు కుమ్మరించి మీటింగులు పెట్టినా, స్పెషల్ ఫ్లైట్ లలో వెళ్లి బెడ్డు మీద ఉన్న నాయకులకు కండువా కప్పినా, ఒక్క “భారత్ మాతాకి జై’’ అనే బీజేపీ నినాదం అన్నిటినీ తుడిచేస్తుందనే బాధ ఆయనలో ఉన్నది. టీఆర్​ఎస్​ను భారత్ రాష్ట్ర సమితి అని మార్చుకున్నా, మనస్ఫూర్తిగా భారత్ మాతాకి జై అని అనలేరు. ఎందుకంటే పక్కనే ఉన్న రాజకీయ దోస్త్ దుష్మన్ అవుతాడేమోనన్న భయం. జై తెలంగాణ అని కూడా గట్టిగా అనలేడు, అటు ఆంధ్రాకు పోతే ఏం సమాధానం చెప్పాలో తెలియదు కాబట్టి. 

బడ్జెట్​ కేటాయింపులు

సత్యం రామలింగరాజు లెక్కల లాగా రాష్ట్ర బడ్జెట్ ను​ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీని విమర్శించే నైతిక హక్కులేదు. ఉదాహరణకు 2022 –-23 ఏడాదిలో  ‘దళిత బంధు’కు రూ.17 వేల కోట్ల బడ్జెట్ ​కేటాయిస్తే, అందులో ఖర్చు పెట్టింది కేవలం రూ.3,300 కోట్లే. ఇది తప్పు అని చెప్పి కేసీఆర్​రాజీనామా చేయగలరా? ఎంబీసీలకు రూ.2,507 కోట్లు బడ్జెట్లో పెట్టి, చివరకు రూ.7 కోట్లు ఖర్చు పెట్టి లెక్కలు, ఎక్కాల గురించి మాట్లాడటం విడ్డూరం. 

దేశ ఆర్థిక వ్యవస్థ : దేశ వృద్ధి రేటు మన్మోహన్​సింగ్​హయాంలో ఎక్కువ ఉండేదని కేసీఆర్​అన్నారు. కానీ అది ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎలా ఉంది అనేది ముఖ్యం. కరోనాతో అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి రేటు తగ్గినా, భారత్ వృద్ధి కొనసాగింది. భారత్1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరడానికి 60 ఏండ్లు పట్టింది, 2 ట్రిలియన్ డాలర్లు కావడానికి 12 ఏండ్లు పట్టింది. మోడీ హయాంలో 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరడానికి కేవలం 5 ఏండ్లే  పట్టింది. అది మోడీ ఘనత. భారత్ ఎదుగుదలలో ప్రధాని మోడీది కీలక పాత్ర. ఆయన ఇమేజ్ ను దెబ్బతీయడం ద్వారా భారత్ ను ఆర్థికంగా దెబ్బకొట్టొచ్చనే కుట్రలో భాగంగానే బీబీసీ డాక్యుమెంటరీ, హిండినబ్​ర్గ్ రిపోర్ట్ లను చూడాలి. 

తలసరి ఆదాయం : పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మనకంటే అద్భుతంగా ఉన్నాయని అంటే, కేసీఆర్​మానసిక పరిస్థితి మీద ప్రజలకు సందేహం కలుగుతున్నది. తలసరి ఆదాయం ఎంత ఉన్నా, కొనుగోలు శక్తి ప్రకారం ఇండియా జీడీపీ11.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, అంటే ప్రపంచంలో మూడో ర్యాంకు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో ఒక కోటి రూపాయలతో వచ్చే సదుపాయాలు ఇండియాలో 22 లక్షలతో సాధ్యం. అంటే భారత్ రూపాయి కొనుగోలు శక్తి ఎక్కువ. కేసీఆర్ తమ ఆస్థాన ఆర్థిక నిపుణులతో ఒక్కసారి చర్చించాలి. 

ప్రభుత్వ సంస్థల అమ్మకం : ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని కేసీఆర్ అనడం విడ్డూరమే. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూములు, దళితుల, బీసీల అసైన్డ్ భూములను లేఔట్ల పేరుమీద అమ్ముతున్నది ఆయనే కదా! రైల్వేకు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఘనత మోడీదే. 1947 నుంచి 2014 వరకు 70,000 కిలోమీటర్ల ఉన్న జాతీయ రహదారులు, కేవలం 8 ఏండ్లలో అదనంగా 60,000 కిలోమీటర్లకు పెరిగాయి. 70 ఉన్న ఎయిర్ పోర్టులు140 అయ్యాయి. దేశంలో బొగ్గు కొరత తీర్చిన ఘనత మోడీదే. 2014 లో 387 ఉన్న మెడికల్ కాలేజీలు ఇప్పుడు 596 అయ్యాయి. 7 ఉన్న ఎయిమ్స్ ల సంఖ్య ఇప్పుడు 22.  మోడీ అభివృద్ధిలో హీరో, అవినీతిలో 0. ఒకప్పుడు కేసీఆర్ నోటనే ఈ మాట బహిరంగ సభలో వినలేదా!

నీళ్లు, నిధులు, నియామకాలు : వీటి గురించి కేసీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రూ. 1.5 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం చెక్ డ్యామ్​వల్ల గత 6 ఏండ్లలో ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తారో, కాల్వలలో పారే నీళ్లు ఎస్సారెస్పీ నీళ్లా? లేదా కాళేశ్వరం నీళ్లా? ఒక సారి నిపుణులతో బహిరంగ చర్చకు సిద్ధమా? 

మేక్ ఇన్ ఇండియా : కేసీఆర్ పదే పదే ఇండియాను కించపరచడం ఎవరికీ రుచించదు. భారత్ ప్రపంచంలో అతి పెద్ద పాల ఉత్పత్తి దేశం. ఫోన్ల తయారీలో 2వ స్థానం, టీ తయారీలో 2, కార్ల తయారీలో 4వ ర్యాంక్, నూతన యూని కార్న్ లలో మూడో ర్యాంక్ మనది. మోడీ వచ్చాక 90,000 నూతన ఆవిష్కరణలు, యుద్ధ నౌక విక్రాంత్ , యుద్ధ విమానం తేజస్, యుద్ధ హెలికాప్టర్ ప్రచండ, నూతన సూపర్ సోనిక్ జెట్, ఇస్రోలో ప్రైవేట్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. మొదటిసారి ఆయుధాల ఎగుమతులు రూ. 60 వేల కోట్ల మార్క్​ను చేరుకున్నాయి. వందే భారత్ రైళ్ల లాంటి ఎన్నో విజయాలు సాధించిన ఇండియాను జోక్ ఇన్ ఇండియా అని అభివర్ణించడం విజ్ఞత కాదు. 

కరెంట్, బొగ్గు ఉత్పత్తి : దేశంలో 2009లో బొగ్గు ఉత్పత్తి 556 మిలియన్ టన్నులు ఉంటే, 2014 లో 557 టన్నులకు చేరింది. మోడీ ప్రధాని అయ్యాక 2022 నాటికి బొగ్గు ఉత్పత్తి 911 మిలియన్ టన్నులకు పెరిగింది. కరెంటు ఉత్పత్తి 2014 లో 2,37,743 మెగావాట్ల ఉత్పత్తి ఉంటే, 2022లో 4,10,200 మెగావాట్లకు పెరిగింది. అలా పెరిగిన కరెంటే కేసీఆర్ తెలంగాణకు ఇస్తున్నారు. పదే పదే 40,000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆరోపించే కేసీఆర్, 2022 లో తెలంగాణ దాటి గోదావరి నీళ్లు 4200 టీఎంసీలు సముద్రంలో కలిస్తే.. ఎంతో శక్తిశాలి అయిన కేసీఆర్ ఆ నీటిని ఎందుకు ఒడిసిపట్టలేదు? ప్రవచనాలు చెప్పే ముందు పాటించడం కూడా ముఖ్యం. ఇక కేసీఆర్ శక్తి యుక్తులు హరించుకు పోయినట్లు కనిపిస్తున్నవి. ఒకప్పుడు టీఆర్ఎస్​కు ఆయనే అండ, కానీ ఇప్పుడు ఆయనే ఆ పార్టీకి భారంగా మారినట్లు కనిపిస్తున్నది. శక్తి సామర్థ్యాలు ఉన్న నూతన నాయకత్వాన్ని ముందు పెట్టి, వారు అసెంబ్లీలో అన్నట్లు ఈ పెంట నుంచి దూరంగా ఉండటం, విశ్రాంతి తీసుకోవడం మంచిదేమో !

మనసులో బెంగ!
బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు కేసీఆర్​ను పొగిడేవాళ్లు అంతా తన దగ్గర ఉన్న టన్నుల కొద్దీ క్యాష్  చూసి మాత్రమే వస్తున్నారని తెలిసి, అయిన వాళ్లను అనవసరంగా పోగొట్టుకున్నామనే బెంగ మొన్న వారి వాయిస్ లో కనిపించింది. తెలంగాణ ప్రజల్లో ఒకప్పుడు కేసీఆర్ కు ఉన్న క్రెడిబిలిటీ ఇప్పుడు లేదు. ఆయన ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ముందర ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక అప్పుడప్పుడు చుట్టపు చూపులా వచ్చే రీజినల్ పార్టీలు అన్ని కేసీఆర్ లో క్యాష్ ను మాత్రమే చూస్తున్నాయి కానీ, కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మోడీ మీద అవినీతి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు కాబట్టి, అదానీ, అంబానీ అని బురద చల్లే  ప్రయత్నం చేశారు. మోడీకి 2024లోప్రజలు మళ్లీ పగ్గాలు అప్పజెబుతారని వారే స్వయంగా చేయించిన సర్వేలు చెబుతుంటే, తన కాళ్ల కింద భూమి కదులుతుంటే, ఆ గాబరా స్పష్టంగా వారి కంఠంలో కనిపించింది. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు మరుగుజ్జులు అని మొన్నటి దాకా అనుకుంటే, హనుమంతుడిలా ఆకాశమంత ఎదిగి, తనదే అనుకున్న లంకకు రాజకీయ నిప్పు పెడుతున్నారు. దీంతో ఫైర్ ఫైటర్ల కోసం మొన్నటి దాక దూరం పెట్టిన వాళ్లను కేసీఆర్​మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. సొంత సేన మీద నమ్మకం లేక, అందులో విభీషణులు ఎంత మంది ఉన్నారో తెలియక నమ్మకాన్ని వదిలి పెట్టి, వేగులను నమ్ముకున్నారు. ‘ఎస్ మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే’ అని కేటీఆర్​అన్నట్లు, ‘ఎస్ బీసీలకు అన్ని బంధు పెట్టినం, మున్ముందు ఇలానే బంధు పెడతాం’ అని కేసీఆర్ చెప్పగలరా? 

- డా. బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు