మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై ఈనెల 20న తేలిపోనుంది. ప్రగతి భవన్ లో దాదాపు గంటన్నర సేపు కంచర్ల కృష్ణారెడ్డి తో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు. మునుగోడు లో జరిగే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గం లో అందరినీ కో ఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రగతిభవన్ నుంచి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులకు పిలుపు వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తుండటంతో భూపాల్ రెడ్డి సోదరులకు ఆహ్వానం రావడం ఆసక్తిగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు.
మునుగోడు నియోజకవర్గం టికెట్ ఆశిస్తూ యాక్టివ్ గా కంచర్ల కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.