తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నర్సాపూర్ అటవీ ప్రాంతంలో తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లేవాడినని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ సమయంలో నర్పాపూర్ అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా షూటింగులే జరిగేవని ఆయన అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అనంతరం రూ. 15 కోట్లతో 630 ఎకరాలలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును ఆయన ప్రారంభించారు.
ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నర్సాపూర్ లో ఒకప్పుడు వర్షాలు బాగా పడేవి. ప్రజలు మేల్కొని మళ్ళీ నర్సాపూర్ ను పాత అడవిగా మార్చాలి. ప్రజల భాగస్వామ్యంతో నర్సాపూర్ అడవి పునరుద్ధరణ జరగాలి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలి. నర్సాపూర్ కి వస్తే నాగార్జున సాగర్ కి వచ్చినట్టే ఉంటుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు, మండల కేంద్రానికి కోటి రూపాయలు, నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్లు కేటాయిస్తం. నర్సాపూర్ లో కోల్పోయిన అడవిని పునరుద్ధరణ చేయాలి. భవిష్యత్తు తరాలకు అవసరమైన వనరులు ఇవ్వాలి. గతంలో సిద్దిపేటలో హరితహారం నిర్వహించినప్పుడు 10 వేల మొక్కల కోసం 1000 అవతారాలు ఎత్తాను. గత పాలకులు అడవిని నిర్లక్ష్యం చేసి కలప దొంగలకు అప్పగించారు. కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టం. కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. కలప దొంగతనం చేస్తే కఠినంగా శిక్షస్తం. ప్రజలు కాపాలదారులుగా మారి అడవులు కాపాడుకోవాలి. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. వచ్చే ఏడాది కొండపోచమ్మ నుండి నర్సాపూర్, సంగారెడ్డికి సాగునీరు అందిస్తాం. రోహిణి కార్తెలో వరి వేసుకునే పరిస్థితి తీసుకొచ్చినం. పట్టుదలతో చేస్తే అన్ని సాధిస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం
‘తెలంగాణ ధనిక రాష్ట్రం. నిధులకు ఇబ్బంది లేదు. తెలంగాణ అద్భుత రాష్ట్రం. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదు అన్నోళ్లకు సమాధానం చెప్పాం. దేశంలో 60 శాతం వరి పండించిన రాష్ట్రం తెలంగాణ అని FCI చైర్మన్ ప్రసాద్ చెప్పాడు. ప్రతి ఊరిలో ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ ఉంది. రూ. 4500 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం చేస్తున్నం. ప్రస్తుతం రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి. రైతుబంధు ద్వారా సహాయం చేశాం. మూడు నెలల్లో రైతుల కోసం రైతు వేదికలు తయారుకావాలి. నియంత్రణ సాగు ద్వారా రైతుల లాభాల కోసం ఆలోచన చేస్తున్నాం. డిమాండ్ ఉన్న పంటలు పండించి… రైతులు లాభాల బాట పట్టాలి. రైతులకు ఏ రాష్ట్రంలో కల్పించని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నాం’అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
మంత్రి హరీష్ రావు..
‘నర్సాపూర్ అటవీ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం ఎప్పుడూ అడుగుతుంటారు. జిల్లాలో అడవుల పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తాం. దేశంలో అడవుల పునరుద్ధరణ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉమ్మడి మెదక్ లో పెద్ద ఎత్తున హరితహారం కింద మొక్కలు నాటాం. సీఎం ఆలోచనకు అనుగుణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 లక్షల 60 ఎకరాల్లో నియంత్రణ వ్యవసాయం సాగుతోంది’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…
‘ఆరో విడత హరితహారం నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ప్రారంభం కావడం సంతోషం. నర్సాపూర్ అడవిని పునరుద్ధరణ చేస్తాం. గత 5 విడతలలో 182 కోట్ల మొక్కలు నాటాం. 6వ విడతలో 30 కోట్ల మొక్కులు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాం. పచ్చదనం, పారిశుద్ధ్యం కోసం గ్రామాల్లో ట్రాక్టర్లు ఇచ్చాం. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. హైదరాబాద్ లో అర్బన్ పార్కులు అందుబాటులోకి తెచ్చాము’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
For More News..