- వేములవాడ, కోరుట్లలో అభ్యర్థుల మార్పు
- చల్మెడ, కల్వకుంట్ల సంజయ్ కు..
- హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి, మంథనిలో మధుకు చాన్స్
కరీంనగర్, వెలుగు: ఈసారి ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రావంటూ జరిగిన ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెక్ పెట్టారు. సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది స్థానాల్లో సిట్టింగ్ లకు టికెట్లు కన్ఫామ్ చేశారు. . వేములవాడ, కోరుట్లలో అభ్యర్థులను మార్చారు. వేములవాడ అభ్యర్థిగా ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు బదులుగా ఆయన కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు అవకాశం కల్పించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి, మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు చాన్స్ ఇచ్చారు. మానకొండూరు, చొప్పదండి, రామగుండం, పెద్దపల్లి స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ.. సిట్టింగులకే అవకాశం దక్కింది. కాగా కొన్ని నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందని ఆశించిన పలువురికి నిరాశ ఎదురైంది.
కరీంనగర్ బరిలో నాలుగోసారి గంగుల..
2000లో కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించిన గంగుల.. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో టీఆర్ఎస్ లో చేరగా 2014 , 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమం, సివిల్ సప్లై శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కమలాకర్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికవడం విశేషం.
కేటీఆర్ ఐదోసారి పోటీ
మంత్రి కేటీఆర్ 2006లో పాలిటిక్స్‌లోకి రాగా 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బరిలోకి దిగి 171 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2010 బైఎలక్షన్ లో, రాష్ట్రం వచ్చాక 2014లో అసెంబ్లీ, 2018 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలిచారు. ఈ రెండు పర్యాయాల్లోనూ మంత్రిగా ఉన్నారు. 2019 నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.
అసమ్మతి ఉన్నా.. చందర్ కే టికెట్
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2001 లో టీఆర్ఎస్ లో చేరారు. 2009లో మహాకూటమి నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. 2014లోనూ రామగుండం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్నుంచి టికెట్ రాకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డికే..
ప్రముఖ ట్రినిటి విద్యాసంస్థల అధినేతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సుపరిచితుడైన దాసరి మనోహర్ రెడ్డి 2010లో టీఆర్ఎస్ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2012 నుంచి ఆ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.
చొప్పదండిలో సుంకె రవిశంకర్..
20 07లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. 2009లో టీఆర్ఎస్ లో చేరారు. ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తూనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్ రవిశంకర్ కు దక్కింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంపై గెలిచారు.
జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్..
జగిత్యాల జిల్లా ప్రజలకు డాక్టర్ గా సంజయ్ కుమార్ సుపరిచితుడు. సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు లాయర్ . వీరి తాత దివంగత చొక్కారావు ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతో 2014లో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఓడిపోగా, 2018 ఎన్నికల్లో గెలిచారు.
హుస్నాబాద్ బరిలో వొడితెల
సీఎం కేసీఆర్ కు కుటుంబంతో ఆత్మీయ అనుబంధం ఉన్న వొడితెల ఫ్యామిలీ నుంచి వచ్చిన సతీశ్ కుమార్ 2001లో టీఆర్ఎస్ లో చేరారు. 2 014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మానకొండూరు నుంచి పోటీలో రసమయి
తెలంగాణ ఉద్యమంలో ధూంధాం వ్యవస్థాపకుడిగా ప్రత్యేకత ఉన్న రసమయి బాలకిషన్ 2009 నుంచి టీఆర్ఎస్ లో పనిచేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ టికెట్ ఆశించినప్పటికీ రసమయికే దక్కింది.
క్రికెటర్ నుంచి పొలిటీషియన్ గా కౌశిక్ రెడ్డి..
క్రికెటర్ గా పేరున్న పాడి కౌశిక్ రెడ్డి 2009లో కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. 2021లో హుజూరాబాద్ బై ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడంతోపాటు మండలిలో విప్ గా
బాధ్యతలు చేపట్టారు.
ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్..
ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పోటీ చేయనున్నారు. 2009 నుంచి ధర్మపురిలో వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ సారి టికెట్ విషయంలో
చివరి వరకు సస్పెన్స్ ఉన్నప్పటికీ... చివరికి ఆయనకే అవకాశం దక్కింది.
అనుచరుల సంబరాలు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, సీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్ కు నాలుగోసారి టికెట్ రాగా తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. మేయర్ సునీల్ రావు, సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్ పాల్గొన్నారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కార్పొరేటర్లు డ్యాన్సులు చేశారు. కోరుట్లలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద పటాకులు కాల్చారు. వేములవాడలో బీఆర్ఎస్చల్మెడ వర్గం సంబురాలు నిర్వహించారు. చల్మెడ సొంత గ్రామం కోనరావుపేట మండలం మల్కపేటలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు చేశారు. చొప్పదండిలో పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్, మున్సిపల్‌చైర్ పర్సన్నీరజ, ఇతర లీడర్లు పాల్గొన్నారు.
ఆరోపణలున్నా పుట్ట మధు టికెట్..
పుట్ట మధు పాలిటెక్నిక్ చదువుతుండగానే మధ్యలో చదువు మానేసి 2001లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 19 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా సీఎం కేసీఆర్ ఆయనను కమాన్ పూర్ జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. లాయర్ దంపతుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు అప్పట్లో దుమారం రేపాయి. కొద్దిరోజులగా ఆయనకు టికెట్రాదని ప్రచారం జరిగినా ఎట్టకేలకు కేసీఆర్ ఆయనపై నమ్మకముంచారు.
వేములవాడ ప్రత్యేకం.. సిట్టింగ్ కు నో
రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్విడుదల చేస్తారన్నప్పటి నుంచి వేములవాడపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. అనుకున్నట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం దక్కింది. చల్మెడ లక్ష్మీనరసింహారావు 2021లో బీఆర్ఎస్ లో చేరారు. ఆయన తండ్రి చల్మెడ ఆనందరావు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2009, 2014 లో కరీంనగర్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం చల్మెడకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఆయనకు టికెట్ దక్కింది.
తండ్రి స్థానంలో తనయుడికి..
కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. ఎంఎస్(ఆర్థో) పూర్తి చేసిన ఆయన హైదరాబాద్, కరీంనగర్ చల్మెడ హాస్పిటళ్లలో సర్జన్ గా పని చేస్తున్నారు. రెండేళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు.