కేసీఆర్​  పర్యటనకు అంతా రెడీ.. 3వేలమందితో  పోలీస్ బందోబస్త్ 

  • సూర్యాపేట కొత్త మార్కెట్ వద్ద ఎల్లుండి బహిరంగ సభ
  • విజయవంతం చేసేందుకు ఇన్​చార్జిల నియామకం
  • ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార యంత్రాంగం  
  • జాతీయ రహదారి పై వాహనాల మళ్లింపు  

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో ఈ నెల 20న సీఎం కే‌సీ‌ఆర్ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీ‌ఆర్‌ఎస్ ఆఫీసులను కేసీఆర్​ ప్రారంభించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీ‌ఆర్‌ఎస్ 12స్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేయగా వచ్చే ఎన్నికల్లో కూడా అదే సత్తా చాటాలని బీఆర్​ఎస్​ టార్గెట్​ పెట్టుకుంది. అందుకే ఈ జిల్లాను కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు లక్ష మందితో 70ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ జన సమీకరణ కోసం సూర్యాపేట నియోజక వర్గంలో ఇన్​చార్జిలను నియమించారు. 

బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు 

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పక్కనే కొత్త మార్కెట్ యార్డ్ సమీపంలో దాదాపు 70ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ రాక కోసం ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ, కొత్త మార్కెట్ యార్డ్ వద్ద హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానున్నది. సభ నిర్వహణ కోసం ఇన్​చార్జీలుగా సూర్యాపేట మండలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, యంసీ కోటి రెడ్డి, ఆత్మకూరు (ఎస్) మండలం గొంగడి మహేందర్ రెడ్డి, నోముల భగత్, చివ్వెంల మండలం రమావత్ రవీంద్ర కుమార్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, పెన్ పహాడ్ మండలం చిరుమర్తి లింగయ్య, పైళ్ళ శేఖర్ రెడ్డి సూర్యాపేట టౌన్ కు గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు వ్యవహరిస్తున్నారు. 

రూట్ మ్యాప్ 

సూర్యాపేట పట్టణంలో 23కిలోమీటర్లు కేసీఆర్​  పర్యటించేలా అధికారులు, పోలీసులు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. హెలికాప్టర్ లో సీఎం సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు.  బీ‌ఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభించిన అనంతరం ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ లను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ ప్రారంభించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఖమ్మం రోడ్, పీఎస్‌ఆర్ సెంటర్ మీదుగా కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ చేరుకొని పార్టీ నాయకులతో మీటింగ్​నిర్వహిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించి అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటన సందర్భంగా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వాహనాలు మళ్లింపు

బహిరంగ సభ నేపథ్యంలో  వెహికల్స్​ను  మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్  నుంచి విజయ వాడ వెళ్ళే వాహనాలను నార్కేట్ పల్లి మీదుగా మళ్లించనున్నారు. ఖమ్మం వెళ్ళే వాహనాలను టేకుమట్ల నుంచి  ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్ మీదుగా నార్కేట్ పల్లి వైపు మళ్లించనున్నారు.