మహబూబ్‌నగర్, వెలుగు : సీఎం కేసీఆర్ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్వారం రోజుల ముందు నుంచే సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆయన ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో మీడియాకు పర్యటన వివరాలు వెల్లడించారు. సీఎం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్ చేరుకుంటారన్నారు. మొదట ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్ సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడి నుంచి భూత్పూర్ మార్గంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడతారని వెల్లడించారు.
నాలుగు రోజుల్లో రోడ్లు కంప్లీట్
సీఎం రాక సందర్భంగా పాలమూరు జిల్లా కేంద్రంలో ఆఫీసర్లు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన ఖరారైందనే సమాచారం అందిన వారం రోజుల నుంచి పనులు స్పీడప్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేయించారు. ఇరుకుగా ఉన్న రోడ్లల్లో అడ్డుగా వస్తున్న కాంపౌండ్ వాల్స్‌ను తొలగించి, రోడ్లను విశాలంగా చేశారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు. అధికార పార్టీ లీడర్లు ఎక్కడికక్కడ భారీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. పాలమూరు అడుగడుగునా పార్టీ జెండాలు కట్టి.. పట్టణాన్ని గులాబీమయంగా మార్చారు.
జన సమీకరణకు వారం రోజులుగా సమీక్షలు
బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారం రోజులుగా కేడర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మండలాల్లో పర్యటించి జన సమీకరణ చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలకు బాధ్యతలు అప్పజెప్పారు. ఇదే సమయంలో గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాయింట్ అవుట్ చేసి నోట్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాటి ఆధారంగా సీఎంకు రిపోర్ట్ ఇచ్చి నిధుల అడుగనున్నట్లు తెలిసింది.
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే సీఎం కేసీఆర్ పర్యటన బందోబస్తు ఏర్పాట్లను శనివారం ఐజీ బి.కమలాసన్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుమందు జిల్లా కేంద్రంలో పోలీస్ ఆఫీసర్లతో సమావేశమై బందోబస్తుపై సూచనలు చేశారు. ఆయన వెంట మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వికారాబాద్ ఎస్పీలు ఆర్.వెంకటేశ్వర్లు, మనోహర్, రంజన్ రతన్ కుమార్, కోటిరెడ్డి ఉన్నారు.