అణచివేత ధోరణి, నిరంకుశ పాలనను తెలంగాణ గడ్డ సహించదని మరోసారి నిరూపితమైంది. హుజూరాబాద్నియోజకవర్గ ప్రజలు మొన్న ఇచ్చిన స్పష్టమైన తీర్పే ఇందుకు నిదర్శనం. ఎంతోమంది ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతుల కన్నీళ్లు ఆగడం లేదు. ప్రజాపాలన మరిచి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తూ.. ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపాలనుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఇటీవలి ఉప ఎన్నిక ద్వారా తిరస్కరించారు. ఇకనైనా కేసీఆర్తన విధానాలు మార్చుకొని తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేదంటే ప్రజాగ్రహం కొనసాగే అవకాశం ఉంది.
సాధారణంగా ఏ పార్టీకి చెందిన వాళ్లు ఆ పార్టీ అభ్యర్థే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ మొన్నటి హుజూరాబాద్ఉప ఎన్నికలో మాత్రం ఓ విచిత్రం జరిగింది. దాదాపు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు అంతర్గతంగా ఈటల గెలవాలని కోరుకున్నారు. వారిలో టీఆర్ఎస్ నేతలూ లేకపోలేదు. కేసీఆర్ పరిపాలన పట్టించుకోకపోవడం, అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఎవరినీ లెక్కచేయకుండా అంతా నా ఇష్టం అనే విధంగా వ్యవహరించడం, ఉద్యమకారులను అణచివేయడం, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చి అందలమెక్కించడం తదితర చర్యలు ఆయా పార్టీల నేతలతోపాటు, ప్రజలు గమనించారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు అనే మాటను వారు బలంగా విశ్వసించారు. అందుకే హుజూరాబాద్ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తన శక్తి నంతా ధారపోసినా విజయం దక్కించుకోలేకపోయింది. భూ కబ్జా ఆరోపణలతోనే ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతలు పదేపదే ప్రచారం చేసినా.. ప్రశ్నించినందుకే ఉద్యమకారుడైన ఈటలను బయటకు పంపారని తెలంగాణ సమాజం, ముఖ్యంగా హుజూరాబాద్ జనం నమ్మారు. అందుకే రాష్ట్రమంతా ఈటల గెలుపును కాంక్షించింది.
హామీలు ఇచ్చుడు.. మరిచిపోవుడు
దళితుడిని సీఎంగా చేయకపోయినా, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వక పోయినా, కేజీ నుంచి పీజీ నిర్బంధ విద్య అమలు చేయకపోయినా, ఇంటికో ఉద్యోగ అవకాశం కల్పించక పోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వక పోయినా ఆయనకే చెల్లింది. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని అడిగే విపక్షాలకు ఆయనిచ్చే సమాధానం ఏమిటంటే “అవును, అన్నం... కానీ చేయలె. అయితే ఏందీ. అయినా ప్రజలు మాకే ఓట్లేసి గెలిపించిన్రు. గదా!”. దీన్ని బట్టి చూస్తే ప్రజలు గొర్రెలు, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోయినా ఓట్లేస్తారు. కాబట్టి ఎన్నికల్లో ఎన్నైనా హామీలు గుప్పించవచ్చు అనే అతి విశ్వాసం, ప్రజలమీద ఆయనకున్న చులకన భావమే ఓటమికి పరోక్షంగా కారణమైంది.
తెలంగాణ వస్తే లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతాం అని చెప్పిన ఆయన ఆ తర్వాత నేను అనలేదు మీకు మీరు రాసుకుంటే నేనా బాధ్యుడిని అని తీసి పడేశారు. ఉద్యమకాలంలో సీమాంధ్ర వారిని ఉద్దేశించి లంకల పుట్టినవన్ని రాక్షసులే అని చెప్పి, తరువాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్ర వారి కాలిలో ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని మాట మార్చారు. ఇవన్నీ కూడా కేసీఆర్ సందర్భాన్ని బట్టి ఏదైనా మాట్లాడగలరు, తిమ్మిని బమ్మిని చేయగలరు.. బమ్మిని తిమ్మిని చేయగలరు అని అర్థమవుతోంది.
కబ్జా పేరుతో తొలగింపు..
కేటీఆర్ ను సీఎం చేయాలని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది ప్రముఖులు ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఉద్యమ కారుడు, బీసీ వర్గాల నేత ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేయకూడదు అనే చర్చ తెర మీదకు వచ్చింది. దీనికి వివిధ బీసీ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించడం కేసీఆర్ ను ఇరకాటంలోకి నెట్టాయి. ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే విషయంపై కేసీఆర్ రహస్యంగా నిర్వహించిన సర్వే లో కూడా మెజారిటీ ప్రజలు ఈటల వైపు మొగ్గినట్టు సమాచారం. ఇక లాభం లేదనుకున్న కేసీఆర్ వెంటనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి సీఎం పోస్టు గురించి ఎవరూ మాట్లాడకూడదని హుకుం జారీ చేశారు. ఇంకా పదేండ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని ప్రకటించారు. మున్ముందు ఈటలతో ముప్పు ఉంటుందని భావించిన కేసీఆర్, ఎవరో రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో రాత్రికి రాత్రే విచారణ జరిపించారు. భూకుంభకోణాలు
అంటూ తన సొంత పత్రికల్లో, టీవీల్లో ఊదరగొట్టడం, మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం చక చకా జరిగిపోయాయి.
ఉద్యమకాలంలో నానా బూతులు తిట్టిన వారు ఇప్పుడు ప్రభుత్వంలో దర్జాగా పదవులు అనుభవిస్తుండగా, రాష్ట్రం కోసం కొట్లాడిన ఎంతోమంది ఉద్యమకారులు కేసీఆర్ అణచివేతకు గురై ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. అత్యంత అవమానకరంగా బయటకు నెట్టి వేయబడిన ఈటల కూడా వారిలో ఒకరయ్యారు. ఈటలను చాలా చిన్న మనిషిగా పేర్కొన్న కేసీఆర్ హుజూరాబాద్ఉప ఎన్నికలో తన యావత్తు శక్తియుక్తులను ప్రదర్శించారు. అయినా విజయం దక్కలేదు. ఈటల తాననుకున్నట్టుగా చిన్న మనిషి కాదు తన అంచనాలను మించి ఎదిగిన వ్యక్తిగా నిరూపితమైంది.
ప్రజా పాలనకే అధికారం..
రాజ్యం మీద కాంక్ష, బంధు ప్రీతి, కుటుంబ పాలన, తన అడుగులకు మడుగులొత్తే వారికే పదవులు కట్టబెట్టడం, మొత్తమ్మీద ఈ తెలంగాణకు నేనే గుత్త పెత్తందారును, నేను చెప్పిందే వేదం అనే విధంగా ప్రవర్తించడం ఆత్మాభిమానం గల తెలంగాణ ప్రజలకు నచ్చదు. ప్రజా పాలన చేసే నాయకులనే ఇక్కడి ప్రజలు అంగీకరిస్తారు. నిజాంను ఉరికించిన పల్లెలు, ఆంధ్రా పెత్తందారులను తరిమిన చరిత్ర ఈ గడ్డకు ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థ ఆగమైతంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్అణచివేత, నిరంకుశ ధోరణి వీడకపోతే మరింత ప్రజాగ్రహం ఎదుర్కోక దప్పదు.