మహబూబ్ నగర్, వెలుగు: డిసెంబర్ 4 న సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.వెంకట్ రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే ప్రజలకు సేవలు దగ్గరవుతాయని , ఈ దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ కోసం హైవే పక్కనే స్థలం లభించిందని, ప్రజలందరికీ అధికారులు అందుబాటులో ఉండనున్నారన్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు, పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్అండ్ బీ ఈఈ స్వామి, మున్సిపల్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం,బెంజమిన్,మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు ఉన్నారు.