బహిరంగ సభల్లో తడబడ్డ కేసీఆర్

బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు రాజకీయ నేతలు తడబడటం సహజం. చిన్న చిన్న నేతలే కాదు సీఎంలు, పీఎంలు కూడా అప్పుడప్పుడు తడబడుతూ మీడియాకు చిక్కుతుంటారు. కాని సీఎం  కేసీఆర్ తన ప్రసంగాల్లో తడబడటం దాదాపు అసాధ్యం. ఏ అంశం గురించి అయినా.. ఏ వ్యక్తి గురించి అయినా.. ఏ సమయంలోనైనా కేసీఆర్ అనర్గళంగా మాట్లాడగలరు. కాని.. మొట్టమొదటి సారిగా మహబూబాబాద్, కొత్తగూడెం బహిరంగ సభల్లో ఆయన తడబడ్డారు.  తడబడటమే కాదు వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. 

తన వాక్చాతుర్యంతో అవతలి వాళ్లకు ప్రశ్నించే అవకాశం ఇవ్వని కేసీఆర్ తాజాగా..  మహబూబాబాద్, కొత్తగూడెం సభల్లో అక్కడక్కడ తడబడ్డారు. మహబూబాబాద్‭లో మాట్లాడుతూ మహబూబ్ నగర్ అన్నారు. మళ్లీ అప్పుడే టక్కున మాట మార్చారు. నేను మహబూబాబాద్ అనే అన్నాను మీరు మహబూబ్ నగర్ అంటున్నారు అంటూ అక్కడున్న వారిని కన్ఫ్యూజ్ చేశారు. ఇక కొత్తగూడెంలో మాట్లాడిన కేసీఆర్.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరు అయితే.. వనమాలో నామా ఉంది అనుకున్నారేమో నాగేశ్వరరావు అంటూ తడబడ్డారు. మళ్లీ అప్పుడే తన పిలుపు మార్చుకుని... కాస్త ఆగి ప్రసంగాన్ని కొనసాగించారు.