![తెలంగాణ చరిత్ర పుస్తకావిష్కరణ..కోట్లాది ఏండ్ల చరిత్రకు తెలంగాణ సాక్ష్యం](https://static.v6velugu.com/uploads/2023/06/CM-KCR-unveiled-the-Telangana-history-books_hvuzNIXMDU.jpg)
హైదరాబాద్, వెలుగు: చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను సీఎం కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో రూపొందించిన ఐదు సంపుటాలను భారత జాగృతి ప్రచురించింది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ పుస్తకాలను రూపొందించారు. తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనదని, కోట్లాది ఏండ్ల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం హర్షణీయమని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ చరిత్రకారులు చేస్తున్న కృషిని అభినందించారు. 20 కోట్లకు పైబడిన చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణేలు, గ్రంథాలు సహా అనేక చారిత్రక ఆధారాలను ఆరేండ్లపాటు అధ్యయనం చేసి రచయితలు ఈ పుస్తకాలు రూపొందించారన్నారు. రేపటి తరానికి ఈ పుస్తకాలు దారి చూపుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, రచయితలు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ఆచారి తదితరులు పాల్గొన్నారు.