బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం : సీఎం కేసీఆర్

భారతదేశంలో రాజకీయ పరిణితి ఇంకా రాలేదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని చెప్పారు. ఎన్నికల్లో వ్యక్తి గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలవాలి అన్నారు. పార్టీల గురించి ఆలోచన చేయాలని, ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఏం అభివృద్ధి చేసిందో ఆలోచించాలన్నారు. 24 గంటల పాటు ఫ్రీగా కరెంటు ఇస్తానంటే కాంగ్రెస్ కండువా తీసేసి గులాబీ కండువా కప్పుకుని.. మీ కార్యకర్తగా పని చేస్తానని అసెంబ్లీలో జానారెడ్డి అన్నారని అన్నారు. ఏడాదిన్నర లోపే అందరికీ కరెంటు ఇచ్చామన్నారు. తాను సక్సెస్ అయ్యాయని, జానారెడ్డి మాత్రం హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఉప ఎన్నికలో జానారెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్‌తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లాలోని హాలియాలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. నాగార్జున సాగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగించారు.

నోముల భగత్ ఎమ్మెల్యే అయ్యే వరకు నాగార్జున సాగర్ కు జానారెడ్డి ఒక డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేదన్నారు. హాలియాలో 50 పడకల ఆస్పత్రి కూడా లేదన్నారు. భగత్ ఎమ్మెల్యే అయ్యాకే అన్ని తీసుకొచ్చామన్నారు. రైతులను ఆదుకోవాలని గతంలో ఏ పార్టీ కూడా ఆలోచించలేదన్నారు. రైతుబంధు ఉండాలా..? వద్దా...? అని ప్రశ్నించారు. రైతుబంధు దుబారా చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఉండాలంటే భగత్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. 24 గంటల కరెంటు వృథా అని, 3 గంటలే చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు. ధరణి తీసి బంగాఖాతాంలో వేస్తారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారనిని మండిపడ్డారు.

ధరణి ఉంటేనే రైతు బంధు, రైతు బీమా వస్తుందన్నారు. ధరణి తీసేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని ఆరోపించారు. తమ రాష్ట్రంలో 5 గంటల పాటు కరెంటు ఇస్తున్నాం.. వచ్చి చూడడంటూ డీకే శివకుమార్ మాట్లాడుతున్నారని, తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అక్కడకు వెళ్లి చూసేది ఏముందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే పెన్షన్లు పెంచామన్నారు. ఎవరు మంచి చేస్తారో.. ఎవరు చేడు చేస్తారో ప్రజలందరూ ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కంటి వెలుగు పథకాన్ని గతంలో ఎవరైనా ఆలోచించారా..? అని ప్రశ్నించారు. భగత్ ను గెలిపించాలని, ఆయన అడిగిన అన్ని పనులను చేసి పెడుతానని హామీ ఇచ్చారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవడం ఖాయమన్నారు. చరిత్రలో ఎవరూ చేయనన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు.
జానారెడ్డి కుమారుడు గెలిస్తే రేపు కూడా ఏమీ జరగదన్నారు.