స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ ఏడాది బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు తన దగ్గర పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.. వాటిని ఆయా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆ నిధులను ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే అభివృద్ధి కార్యక్రమాలపైన కాకుండా.. ఓట్లు రాల్చే పనుల కోసం ఖర్చుపెడుతున్నారు. బడులు, ఆస్పత్రులు అధ్వానంగా ఉంటే.. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్‌తో నియోజకవర్గాల్లో గుళ్లు, మసీదులు, చర్చిలు కడుతుండటం.. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రుజువు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం 2017లో తెలంగాణ గిరిజన ప్రత్యేక అభివృద్ధి చట్టం చేసింది. ఈ చట్టంలో భాగంగా దళిత, గిరిజన జాతుల జనాభా ఆధారంగా తగినన్ని నిధులు సమకూర్చుతూ వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్)ను ఏర్పాటు చేసింది. ఈ చట్టం అమలు కోసం ప్రభుత్వం విధి విధానాలను కూడా రూపొందించింది.
2023-–24 ఆర్థిక సంవత్సరంలో దళిత, గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.15,232 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. ఇదిలా ఉంటే మునుపెన్నడూ లేని విధంగా 2023–-24 ఆర్థిక సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా పదివేల కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధి అని ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంచింది. ఇంత పెద్ద మొత్తం దేని కోసం ఖర్చు చేయాలి ? ఎలా చేయాలి ? అన్నదానిపై స్పష్టత కానీ, విధివిధానాలు గానీ లేవు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొందరు శాసనసభ్యులకు ప్రత్యేక అభివృద్ధి కింద నిధులు విడుదల చేస్తున్నారు.
ఇలా కావాల్సిన శాసనసభ్యులకు నిధులు విడుదల చేస్తుంటే.. సదరు ఎమ్మెల్యే సూచించిన విధంగా సంబంధిత జిల్లా కలెక్టర్ పనులు మంజూరు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే సూచించిన పనులు నిజంగా అక్కడ అవసరమా? కాదా ? ఆ నిధులతో చేపట్టే పనుల వల్ల సంక్షేమం గానీ, అభివృద్ధి గానీ జరుగుతున్నదా? అని ఎవరూ చూడటం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా లేనిది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట రూ.10 వేల కోట్లు ఎన్నికలకు ముందు ఎలాంటి విధివిధానాలు లేకుండా ఇష్టారీతిన ఖర్చు చేయడం, ప్రజాధనం దుర్వినియోగమే కాదు.. ఓటర్లను ప్రలోభ పెట్టడం కూడా.
ఉదాహరణకు అచ్చంపేట
ముఖ్యమంత్రి ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట మంజూరవుతున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ మధ్య అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేకు అభివృద్ధి పనుల కోసం ఎస్డీఎఫ్ కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. కొండ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గానికి ఇంత మొత్తంలో నిధుల విడుదల స్వాగతించదగినదే. అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు.
చాలా కుటుంబాలు కొండలు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే ఎస్డీఎఫ్ నిధులతో అక్కడ చేపడుతున్న పనులకు, నిజంగా స్థానిక ప్రజలకు కావాల్సిన పనులకు ఏమాత్రమూ పొంతనలేదు. రూ. 200 కోట్ల నిధుల మంజూరుకు జిల్లా కలెక్టర్ వరుసగా నాలుగు ప్రొసీడింగుల్లో ప్రార్థనా స్థలాలు, కులాల ప్రాతిపదికన కమ్యూనిటీ హాళ్లు, గ్రామంలో సీసీ రోడ్ల పనులకు అనుమతి ఇచ్చారు.
పనిని ముక్కలు చేసి కార్యకర్తలికివ్వడం..
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన నిధుల నుంచి కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించారు. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఒకే పనిని చిన్న చిన్న ముక్కలుగా రూ.5 లక్షలకు మించకుండా విడగొట్టి, కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిన పనులు ఇస్తున్నారు. నిజానికి రూ.5 లక్షలకు మించిన ఆ పనిని టెండర్ల ద్వారా చేయించాలి. అప్పుడు ఎమ్మెల్యేకు కంట్రాక్టర్ పై అజమాయిషీ ఉండదు. అచ్చంపేట మండలంలోని రంగాపురంలో ఆంజనేయగుడి, ముత్యాలమ్మ గుడి, వెంకటేశ్వర గుడి, చెంచుకాలనీ గుడి ఇలా 5 గుళ్లు, ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సూచన మేరకు జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. ఈ పనులను13 భాగాలుగా చేసి నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వారికి ఇచ్చారు. ఇలా చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపించే ప్రమాదముంది.
పడార మండలంలో కుగ్రామమైన ఉడిమిల్లలో సీసీ రోడ్ల కోసం జిల్లా కలెక్టర్ వర్క్ఆర్డర్ఇచ్చారు. ఆ పని విలువ ఒక కోటి రూపాయిలు. దాన్ని 20 ముక్కలుగా చేసి రూ.5 లక్షలకు ఒకటి చొప్పున నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వారికి ఇచ్చారు. వీరు నామమాత్రంగా పనులు చేసి, నిధులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. లింగాల మండలంలోని అంబటిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.95 లక్షలు మంజూరు కాగా..
దాన్ని రూ.5 లక్షల చొప్పున19 భాగాలుగా చేసి నామినేషన్ పద్ధతిన తమకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నారు. ఇలా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. బహుశా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పు బెల్లంలా పంచుతుందన్న అనుమానం కలుగుతోంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు స్పెషల్ డెవలప్మెంట్ నిధుల విడుదల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు నిలుపుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎస్‌ను కోరింది.
గుళ్లు, మసీదుల నిర్మాణం
అచ్చంపేట నియోజకవర్గంలో స్పెషల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద 238 గుళ్లు, 28 మసీదులు, 6 చర్చిలు, 56 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. అచ్చంపేట రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రదేశాల్లో ఒకటి. చాలా గ్రామాలు కొండా కోనల్లో అభివృద్ధికి దూరంగా ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. కిందటి ఏడాది భారీ వర్షాలతో చాలా వరకు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నా మని ప్రభుత్వం అన్ని వేదికలపై చెబుతున్నా.. ఈ నియో జకవర్గంలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు చేరలేదు. పేదలకు సొంత ఇండ్ల కార్యక్రమం అంటూ ఏమీ లేదు. రోజువారీ జీవనానికి సంబంధించి కనీస వస తులు లేక ప్రజలు ఇబ్బందులు పడు తుంటే.. వాటిని సమకూర్చాల్సిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గుళ్లు, మసీదులు, చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం విడ్డూరంగా ఉంది.
ఎం. పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్