
- ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్‌లో ఏటా తప్పుల మీద తప్పులు
- సర్కారు నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. విద్యార్థులకు శాపం
- ఈసారి ఇంటర్ పరీక్షల్లో రోజుకో తప్పు
- మెమోల్లో తప్పులతో 2019లో 27 మంది విద్యార్థుల మృతి
- పరీక్షలపై ఏనాడూ రివ్యూ చేయని సీఎం
- నామ్కేవాస్తేగా ఎగ్జామ్స్ టైమ్‌లో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్పబ్లిక్ పరీక్షల నిర్వహణ గాడి తప్పింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో సర్కారు ఆటలాడుకుంటున్నది. ఏటా హాల్‌టికెట్లు మొదలుకొని ప్రశ్నాపత్రాలు, రిజల్ట్ వరకూ ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లోనూ రోజూ క్వశ్చన్ పేపర్లలో తప్పులొస్తూనే ఉన్నాయి. 2019లో ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు బలైనా, పరీక్షల నిర్వహణలో వరుసగా తప్పుల మీద తప్పులు జరుగుతున్నా సర్కారు పెద్దల్లో గానీ, విద్యాశాఖ ఉన్నతాధికారుల్లో గానీ చలనం కనిపించడం లేదు.
జరిగిన తప్పులే మళ్లీ మళ్లీ!
రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి 9.07 లక్షల మంది పరీక్షలు రాస్తుండగా.. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ ఎగ్జామ్స్ కు 5.09 లక్షల మంది అటెండ్ కానున్నారు. అయితే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ నాలుగుసార్లు మారింది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా రెండు మూడుసార్లు మారింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన సర్కారు.. గాలికి వదిలేసింది. పరీక్షల టైమ్‌లో కేవలం ఒకటీ, రెండు సార్లు విద్యాశాఖ మంత్రి కలెక్టర్లతో రివ్యూ చేసి వదిలేస్తున్నారు.
గతంలో జరిగిన లోపాలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై మాత్రం సమీక్షలేమీ జరగట్లేదు. దీంతో జరిగిన తప్పులే మళ్లీ జరుగుతున్నాయి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించలేదు. విద్యాశాఖ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌గా కృష్ణారావు ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పరీక్షల నిర్వహణపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు.
తీరు మారని ఇంటర్ బోర్డు
ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతించరు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష గంట ఆలస్యం జరిగినా ఎవ్వరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఈ సారి క్వశ్చన్ పేపర్లలో ఒక్క తప్పు కూడా ఉండొద్దని నాలుగు నెలల పాటు లెక్చరర్లతో బోర్డు అధికారులు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయించారు. అయినా ఈసారి తప్పులొస్తూనే ఉన్నాయి. వీటిని చాలా చిన్న తప్పులుగానే అధికారులు చెప్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రశ్నాపత్రంలో తప్పులు వస్తే అవి అర్థంకాక స్టూడెంట్లు రాయక ఫెయిల్ అయితే.. దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీస్తున్నారు. మరోవైపు అమెరికా, కెనడా వెళ్లి డిగ్రీ చదువాలనుకునే ఇంటర్ స్టూడెంట్లు తప్పనిసరిగా ఈ నెల 7న అటెండ్ కావాల్సిన స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్ (సాట్)కు అటెండ్ కాలేదు. కారణం.. అదేరోజు సెకండియర్ ఎగ్జామ్ ఉండటమే. సాట్ ఎగ్జామ్ ఉందని తెలిసి కూడా ఆరోజు పరీక్షలకు అధికారులు బ్రేక్ ఇవ్వలేదు.
ముగ్గురు ఆఫీసర్లున్నా తప్పులే తప్పులు!
ఇంటర్ బోర్డులో పరీక్షల నిర్వహణ బాధ్యతలను ముగ్గురు కీలక ఆఫీసర్లు చూస్తున్నారు. ఎగ్జామ్స్ కంట్రోలర్‌గా ఖాలిక్, ఎగ్జామ్స్ జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్‌తో పాటు రిటైర్డ్ అధికారి సుశీల్ కుమార్ ఎగ్జామ్స్ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. పరీక్షల నిర్వహణలో కిందిస్థాయి ఆఫీసర్లను వీళ్లు ఇన్వాల్ చేయకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎగ్జామ్స్ విభాగంలోని డిప్యూటీ సెక్రటరీలకు కూడా సమాచారం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. బోర్డులోని వివిధ సెక్షన్లకు తెలియకుండానే ఇటీవల వందల హాల్టికెట్లలో సెకండ్ లాంగ్వేజీ మార్పు చేశారు. ఈ ముగ్గురు ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నా, పరీక్షల నిర్వహణ లోపాలను ఆపట్లేదు.
టెన్త్ హాల్ టికెట్లు లేట్
టెన్త్ పరీక్షల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. అధికారుల అలసత్వంతో హాల్ టికెట్ల జారీలో ఆలస్యమైందనే విమర్శలున్నాయి. ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ప్రకారమే ఫైన్ లేకుండా ఫిబ్రవరి14 వరకు, ఫైన్‌తో మార్చి14 వరకు గడువు ఇచ్చారు. మళ్లీ తత్కాల్ ఫీజు పేరుతో ఏప్రిల్ 20 వరకు టైమ్ ఇచ్చారు. అయితే మెజార్టీ స్టూడెంట్లు ఫిబ్రవరిలోనే ఫీజు చెల్లించారు. అయినా మే 12 నుంచి హాల్‌టికెట్లు వెబ్ సైట్లో పెడతామని అధికారులు చెప్పారు. టెన్త్ హాల్‌టికెట్లు ఆలస్యంగా ఇవ్వడంతో పాలిసెట్ అప్లికేషన్ల ప్రక్రియ కూడా ఆలస్యంగా మొదలైంది. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క పదో తరగతిలో ఎన్ని పేపర్లుంటాయనే విషయాన్ని కూడా చివరి వరకూ చెప్పలేదు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ విషయంలోనూ ఇదే జాప్యం జరిగింది. అయితే ఈ విభాగానికి ఇన్చార్జీ అధికారే కొనసాగుతున్నారు. ఈ నెల 6 నుంచి జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్‌లో వరుసగా బయటపడ్డ తప్పిదాలు..
మొదటిరోజు: ఫస్టియర్ సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్అయ్యాయి. రెండో రోజు: సెకండియర్‌లో జనగామజిల్లాలోని ఓ స్టూడెంట్ కు సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు. తెలుగు, ఉర్దూ క్వశ్చన్ పేపర్లలో తప్పులొచ్చాయి. మూడో రోజు: కోదాడలోని ఓ సెంటర్లో ఫస్టియర్ ఇంగ్లిష్‌కు బదులు కెమిస్ట్రీ బండెల్స్ తెచ్చారు. మళ్లీ సూర్యాపేట నుంచి ఇంగ్లిష్ పేపర్లు తెప్పించారు. గంటన్నర ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజు: సెకండియర్ ఇంగ్లిష్‌లో12వ బిట్లో 6 క్వశ్చన్లకు బదులు 5 ఇచ్చి నాలుగు రాయాలన్నారు. ఆప్షన్లు పెంచుతామని చెప్పి.. పేపర్లో మాత్రం తగ్గించారు. ఇంగ్లిష్ పేపర్లోనూ తప్పులొచ్చాయి.ఐదో రోజు: ఫస్టియర్‌లో పొలిటికల్స్ సైన్స్ హిందీ మీడియం పేపర్లు ప్రింట్ చేయలేదు. చేతిరాతతో రాసినవి అర్థంకాక స్టూడెంట్లు అవస్థలు పడ్డారు. కన్నడ, మరాఠి మీడియం పేపర్లను 30 ఏండ్ల నుంచి ప్రింట్ చేయడం లేదనే తప్పును కూడా చాలా గొప్పగా బోర్డు ప్రకటించుకున్నది. బాటనీ, మ్యాథ్స్‌లో తప్పులొచ్చాయి. ఆరో రోజు: సెకండియర్‌లో పొలిటికల్ సైన్స్‌లో 8వ క్వశ్చన్ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో వేర్వేరుగా వచ్చింది. ఉర్దూమీడియంలోనూ పలు ప్రశ్నల్లో తప్పులొచ్చాయి.
మూడేండ్లలో ఇంటర్ పరీక్షల తీరిది..
2019 మార్చి ఇంటర్ ఫలితాల్లో తప్పులొచ్చాయి. వీటిని సరిచేయడంలో ఆలస్యం వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
2020 మార్చి ప్రశ్నా పత్రాల్లో భారీగా తప్పులొచ్చాయి. కరోనా వల్ల సప్లిమెంటరీ పెట్టలేదు. ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేశారు.
2021 మార్చిలో పరీక్షలు జరగలేదు. ఫస్టియర్ మార్కుల ఆధారంగానే సెకండియర్ వారికి ఇచ్చారు. ఫస్టియర్ వారందరినీ ప్రమోట్ చేశారు. కానీ, సెకండియర్ చదువుతున్న వారికి 2021 అక్టోబర్‌లో ఫస్టియర్ పరీక్షలు పెట్టారు. కేవలం 42% మంది విద్యార్థులే పాసయ్యారు. ఫెయిలయ్యామన్న ఆవేదనతో ఆరుగురు చనిపోయారు. ఆ తర్వాత స్టూడెంట్ల ఆందోళనతో మిగిలిన వారందరినీ ప్రభుత్వం మినిమమ్ మార్కులతో పాస్ చేసింది.