బీఆర్​ఎస్​ను నమ్మితే మన కొంపలు కూడా మిగలవు: బండి సంజయ్

  • ఖజానా నింపుకునేందుకే మద్యం టెండర్లు
  • డబ్బుల కోసమేకాంగ్రెస్​ అప్లికేషన్లు 
  • అప్పుల ఊబిలో ఉన్నరాష్ట్రాన్ని నడపడం హస్తం పార్టీ వల్ల కాదు
  • వరల్డ్  ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటో జర్నలిస్టులను సన్మానించిన ఎంపీ  

కరీంనగర్, వెలుగు: దివాలా తీసిన సర్కారు తన ఖజానా నింపుకొనేందుకే ముందస్తు మద్యం టెండర్లు నిర్వహిస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. ఒక్క మద్యం అప్లికేషన్లతోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు వచ్చాయన్నారు. ఓట్ల కోసం రోజుకో స్కీమ్​ తెస్తున్న సీఎం కేసీఆర్  మాటలు నమ్మకూడదన్నారు. బీఆర్ఎస్  మరోసారి గెలిస్తే మన కొంపలు కూడా మిగలవన్నారు. వరల్డ్  ఫొటోగ్రఫీ డే సందర్భంగా సంజయ్.. కరీంనగర్​లోని తన ఆఫీసులో శనివారం ఫొటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు అధికారమిస్తే తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచారని ఫైరయ్యారు. డబ్బుల కోసమే కాంగ్రెస్  ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ను నమ్మితే  అవినీతి ప్రభుత్వమే వస్తుందని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని నడపడం కాంగ్రెస్​ వల్ల కాదన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని, ఇక్కడ కూడా బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.

తాను ఎక్కడి నుంచి   పోటీ చేయాలో కేంద్ర  నాయకత్వం నిర్ణయిస్తుందని, ఎంపీలంతా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలన్న చర్చ  పార్టీలో జరగలేదని తెలిపారు. ఏపీ బీజేపీ బాధ్యతలపై మాట్లాడుతూ తాను ఓటర్ ఎన్ రోల్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే 21న విజయవాడ వెళ్తున్నానని చెప్పారు. ఏపీతోపాటు ఒడిశా, మహారాష్ట్రలో ఓటర్ ఎన్ రోల్ మెంట్ బాధ్యతలను అధిష్టానం తనకు అప్పగించిందని తెలిపారు.   

పెద్దపల్లి గ్యాంగ్ రేప్  ఘటనపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలి  

పెద్దపల్లి జిల్లాలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్  ఘటన ‘దిశ’ కేసు కన్నా ఘోరమని బండి సంజయ్  అన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు బీఆర్ఎస్  ప్రభుత్వం కుట్రచేస్తున్నదని ఆయన ఆరోపించారు. ‘‘తనను నలుగురు యువకులు రేప్  చేశారని స్వయంగా బాధిత బాలిక చెప్పినట్లు ఆడియో బయటకు వచ్చినా పట్టించుకోని పోలీసులు.. అమ్మాయి సూసైడ్  చేసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉంది.  సీఎంఓ నుంచి వచ్చిన సంకేతాలు, హోం మంత్రి పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్యాంగ్ రేప్  నిందితుల తరఫున ఓ రియల్టర్..  కేసును మాఫీ చేయించేందుకు కుట్ర చేస్తున్నాడు. ఈ ఘటనపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.  దోషులను కఠినంగా శిక్షించాలి” అని సంజయ్  వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలేవి? 

తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు రోగమొచ్చి ఆస్పత్రిలో చేరితే చికిత్స చేసుకునే స్థోమత ఉండడం లేదని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదన్నారు. ఉండటానికి ఇల్లు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇస్తానన్న ఇండ్ల స్థలాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆయన ఫైరయ్యారు. జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్  చేశారు.