
- సభకు ఏర్పాట్లు పూర్తి
సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌గా భావించే హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచార నగారాను మోగించడానికి సిద్ధమయ్యారు. మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలనే దిశగా ఆదివారం ప్రజా ఆశీర్వాద సభ ను నిర్వహిస్తున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచి ప్రారంభించడంతో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో మూడోసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డు లోగల సబ్ స్టేషన్ వద్ద 20 ఎకరాల ప్రైవేటు స్థలంలో ప్రజా ఆశ్వీర్వాద సభకు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు.
సభ ఏర్పాట్ల పై మంత్రి దిశా నిర్దేశం
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడం కోసం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వినోద్ కుమార్ తో కలసి మంత్రి హరీశ్ రావు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హుస్నాబాద్ లో పర్యటించి సభా స్థలిని ఎంపిక చేయగా శనివారం మరోసారి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, కరీంగనర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, హన్మకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నుంచి భారీగా జనాలను సమీకరించడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఐదు గ్రామాలకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించారు. గ్రామాల నుంచి సభకు జనం డప్పు చప్పుల్లు, బతుకమ్మలు, పీరీలు, బోనాలతో ర్యాలీగా సభా స్థలికి చేరేలా ఏర్పాట్లు చేశారు.
పోలీసు భారీ బందోబస్తు
ప్రజా ఆశీర్వాద సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభాస్థలి తో పాటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హెలిప్యాడ్ లను సీపీ శ్వేత పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, ప్రజలకు ఇబ్బందులు కలగుండా ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం, పార్కింగ్ , హెలిప్యాడ్ లతో కలుపుకుని మొత్తం ఆరు సెక్టార్లుగా విభజించి పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ ప్రదేశాలకు చేరే విధంగా పోలీసులు సూచలను ఇవ్వాలని, రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలను పార్కు చేయకుండా చూడాలని సీపీ పోలీసులకు సూచించారు.
అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంతో పాటు సెంట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్చేయాలని సూచించారు. కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల నుంచి వచ్చే వాహనదారులు కరీంనగర్ రోడ్ లోని ఇండియన్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్నారు. మథ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే దారి లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేయనున్నారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే వాహనాలను నాగారం, మహ్మదాపూ, బొమ్మనపల్లి, సుందరగిరి మీదుగా మల్లించడానికి ఏర్పాట్లు చేశారు.