ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎమ్మెల్యే జైపాల్‌ చెప్పేవన్నీ అబద్ధాలే

ఆమనగల్లు, వెలుగు: కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ చెప్పేవన్నీ అబద్ధాలని జాతీయ బీసీ కమిషన్ ​మాజీ మెంబర్‌‌ ఆచారి విమర్శించారు.  శనివారం ఆమనగల్లులో మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం బస్టాండ్ ​ఆవరణలో బీఆర్‌‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అభివృద్ధి పనులన్నింటికీ తానే నిధులు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.  2018 ఎన్నికల్లో సీఎం ఆమనగల్లుకు  ఇస్తానన్న 150 పడకల ఆసుపత్రి ఏమైందని  ప్రశ్నించారు.  మున్సిపాలిటీ అభివృద్ధికి నెల నెలా రూ. 30 లక్షలు ఇస్తున్నానని అబద్ధాలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రూ. 14 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ. 14 లక్షలు ఇవ్వాల్సి ఉందని, అవి ఇవ్వకపోగా  కేంద్రం నిధులను మళ్లించారని ఆరోపించారు.

ఆమనగల్లు మున్సిపాలిటీకి జల్ నల్​ పథకం కింద రూ. 32 కోట్లు తీసుకొస్తే  ఎమ్మెల్యే తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.  సీఆర్​ఎఫ్​ గ్రాంట్​ కింద ఆమనగల్లు, తలకొండపల్లి రోడ్డుకు రూ. 37 కోట్లు, తుక్కుగూడ నుంచి డిండి  వరకు , కొట్రగేటు నుంచి కొల్లాపూర్​ వరకు నాలుగు లేన్ల రోడ్డు , కల్వకుర్తి నుంచి కొల్లాపూర్​ మీదుగా నంద్యాల వరకు హైవేను వేల కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు.  ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే ఆమనగల్లు బస్టాండ్‌లో ముక్కు నేలకు రాస్తానని,  లేదంటే జైపాల్ యాదవ్‌ ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. 

నేడు గురుకుంటకు సీఎం కేసీఆర్
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

నవాబుపేట,  వెలుగు: మహబూబ్​నగర్ ​జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి ఆదివారం సీఎం కేసీఆర్ ​రానున్నారు.  ఇటీవల మృతి చెందిన ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి సోదరుడు మన్నె వెంకట్రాంరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు.  ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో  శనివారం కలెక్టర్​ వెంకట్‌రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్​, ఆర్డీవో అనిల్​కుమార్ ఇతర శాఖల అధికారులు గ్రామానికి వెళ్లారు.  ఎంపీ శ్రీనివాస్ రెడ్డి,  టీటీడీ బోర్టు మెంబర్​మన్నె జీవన్​రెడ్డిలతో హెలీప్యాడ్‌తో పాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

త్వరలోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు : ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి చెప్పారు. శనివారం పీఆర్టీయూ ఆఫీసులో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి  చీప్ గెస్ట్‌‌గా హాజరై మాట్లాడారు. టీచర్లు ఏళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రాసెస్‌‌ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.  317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన టీచర్లు బదిలీల్లో మరో అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేశామన్నారు.  మార్చిలో జరగబోయే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను పీఆర్‌‌‌‌టీయూ తరఫున మూడోసారి బరిలో ఉంటానని, మద్దతివ్వాలని కోరారు.   పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుంకుడు శ్రీనివాస్, మరికంటి బాలరాజు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేశవులు పాల్గొన్నారు.