ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఊహించని రీతిలో సిలిండర్ పేలి.. ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలు పాలయ్యారని తెలిసిన వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు కూడా ఫోన్ చేసి, ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పార్టీ తరుపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు తన తరుపున ప్రత్యేకంగా చనిపోయిన వారి కుటుంబాలకు -రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. మరోవైపు.. మంత్రి కేటీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
చీమలపాడు వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే నేతలను ఆహ్వానిస్తూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని అది పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.