
సీఎం కేసీఆర్ తనకు స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మొన్న రిలీజ్ చేసిన టికెట్ల జాబితాలోనూ మార్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలిసిందన్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై మాదిగలు అసంతృప్తిలో ఉన్నారని, మందకృష్ణ మాదిగతో పాటు పలువురు నియోజకవర్గ లీడర్లు ఫోన్లో మద్దతు తెలియజేస్తున్నారని వివరించారు.
హనుమకొండ సర్క్యూట్ హౌజ్ మార్గంలోని తన నివాసంలో మంగళవారం రాజయ్య మీడియాతో మాట్లాడారు. టికెట్ కేటాయించకపోతే తన రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తెలంగాణలో ఎస్సీ మాదిగల జనాభా 12 శాతం నుంచి 13 శాతం, మాలలు 5 శాతం నుంచి 6 శాతం, ఇతర ఉపకులాలు 0.7 శాతం నుంచి 1 శాతం వరకు ఉంటాయని వివరించారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో 85వేల ఎస్సీ జనాభా ఉంటే.. అందులో 67వేల వరకు మాదిగ కమ్యూనిటీ మాత్రమే ఉందని వివరించారు. టికెట్ మాదిగలకు మాత్రమే కేటాయించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తున్నదని వివరించారు. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తామంటున్నారని, కానీ.. తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని రాజయ్య తేల్చి చెప్పారు.