సీఎం కేసీఆర్ సోమవారం దామరచర్లలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల కల్లా దామరచర్లకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ లో కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతి గురించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం హైద్రాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణమవుతారు.
ప్లాంటు వివరాలివీ..
మొత్తం రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు నిర్మిస్తున్నారు.మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరుకల్లా ప్రారంభిస్తామని జెన్‌కో వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి కరెంటు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ మహాధర్మల్ పవన్ ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. 2023 డిసెంబరు నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా... ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్‌కోకు సీఎం సూచించారు.