నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో కేసీఆర్ పార్టీ బంద్ పెట్టుకుంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో వాల్మీకి బోయల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 8 లక్షల మంది బోయలు ఉన్నారని, వీరిలో ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 99 శాతం బహుజనులు ఉంటే మిగతా ఒక శాతం ఉన్న వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని తెలిపారు.
తాను సీఎం కావడానికి కాదని, బహుజనులు సీఎం కావడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చైర్మన్ పదవులు ఇచ్చి మనల్ని పై స్థాయికి రానివ్వడం లేదని, వాళ్లేమో కోకాపేటలో ఆకాశమంత భవనాలు కట్టుకొని ఏసీలలో ఉన్నారని ఆరోపించారు. వాల్మీకి బోయలకు బీసీ బంద్ కూడా లేదని వాపోయారు. వాల్మీకి బోయలను బీసీల నుంచి గిరిజన తెగలో కలపాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో వాల్మీకి బోయలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. సభలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ నాయుడు, మల్లయ్య, సత్యనారాయణ, శేఖరయ్యా, బ్రహ్మయ్య, నరసింహ పాల్గొన్నారు.