సీఎం కేసీఆర్ ఓకే అంటే విమానం ఎగురుడే!

  • మామునూరు ఎయిర్​పోర్ట్ కు 253 ఎకరాలు అడిగిన ఎయిర్​పోర్ట్​ అథారిటీ
  • ఏ-320  మోడల్​లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ
  • పోర్ట్​ చుట్టూరా రైతుల భూములు 249.33 ఎకరాలుగా గుర్తింపు
  • ‘భూమికి.. భూమి’ డిమాండ్‍ చేస్తున్న బాధితులు
  • అందుబాటులో  పీవీ వెటర్నరీ యూనివర్సిటీకి 605పైగా ఎకరాలు
  • అందులో 373 ఎకరాలు బదలాయించాలని కలెక్టర్‍ ప్రపోజల్​
  • రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపు

వరంగల్‍, వెలుగు:  వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​లో  మరోసారి విమానాలు ఎగరడం అనేది ఇక సీఎం కేసీఆర్‍ చేతిలోనే  ఉంది.   ఎయిర్​పోర్ట్​  రీఓపెనింగ్​కు  ఎన్నో అడ్డంకులు దాటి సేకరించాల్సిన భూములకు సంబంధించి కూడా  క్లారిటీ వచ్చింది.  అక్కడికి దగ్గరలోని పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీకి  చెందిన సగం భూములను ఎయిర్‍పోర్ట్​ కోసం బదలాయించాలని కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ప్రభుత్వానికి ప్రపోజ్​ చేశారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు పెద్దగా సీఎం కేసీఆర్‍ దీనిపై  ఓ నిర్ణయం తీసుకుంటే మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ నుంచి  విమానాలు ఎగిరే అవకాశం స్పష్టంగా కనపడ్తున్నది. 

ఉడాన్‍ స్కీంతో..  రీ ఓపెన్‍ చాన్స్​

ఎయిర్‍పోర్ట్​ రీఓపెనింగ్​ అంశం ప్రభుత్వాలకు ఎన్నికల హామీగా పనికొచ్చింది.  1981లో విమానాశ్రయంలో  రాకపోకలు బంద్‍ కాగా.. 2007 దీనిని ఓపెన్‍ చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‍పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియా (ఏఏఐ)తో ఎంవోయూ కుదుర్చుకున్నాయి.  ఈ క్రమంలో వరంగల్, కడప ఎయిర్‍పోర్టుల డెవలప్‍మెంట్‍ కోసం ప్రభుత్వాలు రూ.6 కోట్లు శాంక్షన్​ చేశాయి. 2008లో విమానాలు నిలిపేందుకు మామూనూర్‍  రన్‍వే ఎలా ఉందో పరిశీలించేందుకు ఏఏఐ ఆఫీసర్లు సందర్శించారు. 2009లో వరంగల్‍తో పాటు హైదరాబాద్‍, వైజాగ్‍, విజయవాడ, కడప, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‍పోర్ట్​ల అభివృద్ధికి అప్పటి సర్కార్​ రూ.59 కోట్లు శాంక్షన్​ చేసింది.

కాగా, ప్రత్యేక రాష్ట్రంలోనూ కేసీఆర్‍ ప్రభుత్వానికి మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ రీ ఓపెన్‍ ఎన్నికల హామీ అయ్యింది తప్పితే.. అడుగులు ముందుకు పడలేదు. ఈ క్రమంలో  కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్‍ 27న  ఉడాన్‍ స్కీం తీసుకొచ్చింది.  సామాన్యులు సైతం విమాన ప్రయణాలు చేయడం, రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచే క్రమంలో టూరిజం ప్లేస్​లకు దగ్గరగా ఉండే ఓల్డ్​ ఎయిర్​పోర్ట్​లు (బ్రౌన్‍ ఫీల్డ్​) పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంది.  దీంతో అప్పటికే 36 ఏండ్ల కింద మూతపడ్డ మామూనూర్‍ ఎయిర్‍పోర్ట్​ రీ ఓపెన్‍ చేసేందుకు చాన్స్​ వచ్చింది.

హామీలు తప్పితే..అడుగులు పడలే

ఎయిర్‍పోర్ట్ కు సంబంధించిన కొన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి.  ప్రస్తుతం 670 నుంచి 700 ఎకరాలున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్‍ ప్రభుత్వం పెద్దగా చొరవ చూపలేదు.  ఎయిర్‍పోర్ట్​ ప్రారంభించేందుకు 1,200 ఎకరాల భూములు అవసరమని..  ఇప్పుడున్న వాటికి మిగతా భూములు సేకరించి ఇవ్వాలని ఎయిర్‍పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియా సూచించింది. అప్పుడే బోయింగ్‍ వంటి పెద్ద విమానాలు పూర్తిస్థాయిలో నడపడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 500 ఎకరాల భూముల సేకరణలో చొరవ చూపలేదు. అదే సమయంలో ఏఏఐ ఆఫీసర్లు 2020లో మామునూర్‍, వరంగల్‍ సిటీలోని సేకరించిన మట్టి నమూనాలకు సంబంధించి విమానాలు ఎగరడానికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు పాజిటివ్ రిపోర్ట్​ ఇచ్చారు.  అయితే ఏఏఐ అడిగిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎయిర్‍పోర్ట్​ అధికారులు మరో ప్రతిపాదన చేశారు. 500 ఎకరాలకు బదులుగా కనీసం 253 ఎకరాలు సేకరించి ఇస్తే.. ఏ-320 తరహాలో ఎయిర్​పోర్ట్​ రీ ఓపెన్‍ చేస్తామని సూచించారు.

373 ఎకరాలకు ప్రపోజల్స్ పెట్టాం​
ప్రావీణ్య, కలెక్టర్,  వరంగల్‍ 

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ను ఏ-320 తరహాలో రీ ఓపెన్‍ చేయాలంటే ఏఏఐ ఆఫీసర్లకు 253 ఎకరాల భూములు అప్పగించాల్సి ఉంది. నక్కలపల్లి, గాడిపల్లి, బొల్లికుంట రైతుల నుంచి ఆ భూములు సేకరించాల్సి ఉంది.  డిజిటల్‍ సర్వే చేయగా వారివద్ద దాదాపు 249.33 ఎకరాలు ఉన్నట్లు తేలింది.  అయితే రైతులకు పరిహారం ఇచ్చేందుకు దగ్గర్లో అందుబాటులో ఉన్న పీవీ వెటర్నరీ యూనివర్సిటీ భూముల్లో 373.02 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకెళ్తాం. 

253 ఎకరాలపై.. సీఎం     కేసీఆర్‍ నిర్ణయం తీసుకోవాలే 

ఉడాన్‍ స్కీంలో ఏఏఐ ఆఫీసర్లు కోరిన మిగతా 253 ఎకరాల భూముల సేకరణకు గూగుల్‍ సర్వేల ఆధారంగా జిల్లా ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ప్రపోజల్స్​ పెట్టారు. ఏఏఐ అడిగిన ప్రకారం ఇచ్చేందుకు నక్కలపల్లి, గాడిపల్లి, బొల్లికుంట గ్రామల పరిధిలో రైతులకు చెందిన 249.33 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని సేకరించే క్రమంలో రైతులకు పరిహారంగా భూమికి.. భూమి ఇవ్వాల్సి ఉన్నట్లు చెప్పారు.  దీనికోసం ఇదే మామునూర్‍లో  పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి దాదాపు 605పైగా ఎకరాల ప్రభుత్వం భూములు ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్‍పోర్ట్ అభివృద్ధి కోసం ఇందులోని 373.02 ఎకరాల భూములను ఖిలా వరంగల్ తహసీల్దార్​ ఆఫీస్‍కు బదలాయించాలని రిపోర్ట్​ ఇచ్చారు. ఇదే విషయాన్ని వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్య జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావును కలిసి వివరించారు. ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. యూనివర్సిటీ భూములను ఎయిర్‍పోర్ట్ కోసం అప్పగించడంపై ఇప్పుడు సీఎం కేసీఆర్‍ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఓ రకంగా మామూనూర్‍ ఎయిర్‍పోర్టులో విమానం ఎగరడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.