ఆటో డ్రైవర్ల కోసం సీఎం కేసీఆర్ కొత్త హామీ

ఆటో డ్రైవర్లకు  సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  ప్యాసింజర్ ఆటోలకు  ఫిట్ నెస్ ఫీజు రూ. 700, పర్మిట్ రూ. 500 మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఆటో కార్మికులకు ఆ బాధే ఉండదన్నారు. తాను కరీంనగర్ కు వచ్చిన ప్రతిసారీ ఒక కొత్త స్కీమ్ ప్రకటిస్తామని కేసీఆర్  తెలిపారు.  మానకొండూర్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.

ఓటు వేసేముందు అభ్యర్థుల, పార్టీ చరిత్ర గమనించాలని ఓటర్లకు చెప్పారు సీఎం కేసీఆర్. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. లేదంటే అదే ఓటు మిమ్మల్ని కాటేస్తుందని చెప్పారు.  మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ గొప్పలు చెప్తుందని..  ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఎందుకు పార్టీ పెట్టినట్టు అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో అన్నమే దొరకలేదన్న సీఎం... ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టడమా అని నిలదీశారు.  

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ప్రజలు  ఆలోచించాలన్నారు.  కాంగ్రెస్‌ పాలనలో ప్రతిరోజూ  రైతుల ఆత్మహత్యలు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తానని అంటుందని, ధరణి రద్దు చేస్తామని అంటుందని ఇవి ఉండాలో పోవాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు.