కోటిన్నర గొర్రెలిస్తమన్న సీఎం కేసీఆర్​ హామీ నెరవేరలే

 

  • కోటిన్నర గొర్రెలిస్తమన్న సీఎం కేసీఆర్​ హామీ నెరవేరలే
  • ఐదేండ్లలో 82.64 లక్షలే ఇచ్చిన్రు
  • కోటిన్నర గొర్రెలిస్తమన్న హామీ నెరవేరలే

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ​చెప్పినట్లుగా రాష్ట్రంలో గొర్ల మందలు పెరగలేదు. రెండేండ్లలో గొర్ల సంపద కోట్లకు చేరుతుందన్న మాట ఉత్తముచ్చటే అయింది. కోటిన్నర గొర్రెలు ఇస్తామని చెప్పి ఐదేండ్లలో ఇచ్చింది 82.64 లక్షలే. ఇందులో సగానికి సగం అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. చెప్పిన ప్రకారం గొర్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో తక్కువలో తక్కువ 20 కోట్లు ఉండేటివి. మరోవైపు ఏడాదికి 2 కోట్ల గొర్రెలు స్లాటర్‌ అవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఐదేండ్లలో 10 కోట్ల గొర్రెలు స్లాటర్‌ కాగా ఇంకా 10 కోట్లు ఉండాలి కానీ  ఇప్పుడు రాష్ట్రంలో 2 కోట్లకు మించి లేవు. ఇప్పటికీ రాష్ట్రానికి రోజు వందల లారీల్లో గొర్రెలు వస్తున్నాయి. ఐదేండ్లుగా మాంసం ధరలు పెరుగుతూ ఉన్నది. కిలో రూ.800 దాటింది.

స్కీం పెట్టే నాటికి 1.23 కోట్ల గొర్రెలు

2014లో రాష్ట్రంలో 1.23 కోట్ల గొర్రెలు ఉండేవి. 2017లో స్కీం ప్రారంభించే నాటికే 1.28 కోట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 2019లో నిర్వహించిన సెన్సెస్‌లో 1.91 కోట్లు ఉన్నట్లు నేషనల్‌ లైవ్‌ స్టాక్స్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏటా పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం 2022 నాటికి 2 కోట్ల వరకే ఉన్నట్లు సమాచారం. 

మునుగోడులో గొర్లలకు బదులు నగదు

రోజుకు 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ఈ లోటు తీర్చడానికి, గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు 75 శాతం సబ్సిడీతో 7.29 లక్షల మందికి 1.53 కోట్ల గొర్రెలు పంపిణీ చేయాలని 2017లో  ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 3.93 లక్షల యూనిట్లను పంపిణీ చేయగా, ఇంకా 3.38 లక్షల కుటుంబాలకు అందించాల్సి ఉంది. కానీ ఎన్నికలు వచ్చినప్పుడే సర్కారుకు ఈ స్కీం గుర్తొస్తుంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొదటి విడత పంపిణీ చేపట్టింది. ఆ తరువాత హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా గొర్రెల పంపిణీ చేసింది. ఇలా ఈ ఐదేండ్లలో మొత్తం 3 లక్షల 93 వేల 542 యూనిట్లను పంపిణీ చేసింది. అంటే ఇప్పటి వరకు పంపిణీ చేసింది 82.64 లక్షల గొర్లు మాత్రమే. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పథకాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చింది. కొత్తగా పైలెట్‌ ప్రాజెక్టుపై నగదు బదిలీ చేపడుతున్నది. మునుగోడులోని ఆరు మండలాల్లోని 7,600 మంది లబ్ధిదారులను దీనికి ఎంపిక చేసింది. వారిలో 4,720 మంది మాత్రమే డీడీలు తీశారు. ఒక్కోలబ్ధిదారునికి 1.58 లక్షల చొప్పున సర్కారు ఇప్పటికే రూ.74.57 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి వాటిని ఫ్రీజ్‌ చేసింది. 4,720 మందిలో 1,350 మంది అకౌంట్‌ వివరాలు లేవని రూ.21 కోట్లు జమ కాకుండా రిటెన్‌ అయ్యాయి.

డీడీలు కట్టి ఎదురుచూస్తున్నరు..

రాష్ట్రవ్యాప్తంగా 26,899 మంది అర్హులైన గొల్లకురుమలు డీడీలు కట్టి గొర్రెల కోసం ఎదురుచూస్తున్నరు. ఇంట్లో మహిళల బంగారం కుదువపెట్టి, వడ్డీలకు తీసుకుని డీడీలు కట్టిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కీం గొల్లకురుమల ఓట్ల కోసం తప్ప వారు బాగుపడాలనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు లేదని గొర్లకాపర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గైడ్‌ లైన్స్‌ లేకుండా ఆగమేఘాల మీద అక్టోబరు1న ఆర్డర్‌ ఇచ్చింది. డీడీలు తీసిన వాళ్లందర్నీ సర్కారు పక్కన పెట్టింది.