కరకట్టలు.. ఉత్తమాటలు.. అడ్రస్​ లేని సీఎం కేసీఆర్​ హామీ

కరకట్టలు.. ఉత్తమాటలు
రూ.1,000కోట్లతో  కడుతామని చెప్పి ఒక్క పైసా ఇవ్వలె
అడ్రస్​ లేని సీఎం కేసీఆర్​ హామీ
భద్రాచలంలో గోదావరి వరద బాధితుల కష్టాలు పట్టని సర్కార్​
ప్రపోజల్స్​మూలకు..  ఎక్స్​పర్ట్స్​ సూచనలు గాలికి..
మరో నెలలో వానా కాలం మొదలు..
ఇంకెప్పుడు కడుతారని ప్రతిపక్షాలు, జనాల డిమాండ్​

భద్రాచలం, వెలుగు : గతేడాది జులై 17న భద్రాచలంలో  గోదావరి  వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్​  రూ.1,000 కోట్లతో కరకట్టలు కట్టి వరదల నుంచి ముంపు గ్రామాలను కాపాడుతామని  హామీ ఇచ్చారు.  మరో నెల రోజుల్లో  వానాకాలం ప్రారంభం కానుంది. ఇప్పటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారులు రూపొందించిన ప్రపోజల్స్​ సర్కారు వద్దే మూలుగుతున్నాయి.  

గత ఏడాది జులై లో వచ్చిన వరదలకు భద్రాచలం,  దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో 79 గ్రామాల్లోని 15, 465 కుటుంబాలు ముంపుతో ఇక్కట్ల పాలయ్యారు. వందల ఎకరాల్లో పంట నీటమునిగింది.  సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ అడ్రస్​ లేకుండా పోయింది. తిరిగి వానా కాలం వస్తుందంటేనే తీర ప్రాంత ప్రజల్లో గుబులు పడుతున్నారు.

ఏదీ అతిపెద్ద కరకట్ట...?

దేశంలోనే అతిపెద్ద కరకట్ట నిర్మించడం ద్వారా గోదావరి తీర ప్రాంత గ్రామాలను కాపాడుతామని సీఎం స్థానికులకు హామీ ఇచ్చారు.  124 కి.మీల మేర 100 అడుగుల ఎత్తున కరకట్టలు అద్భుతంగా కడుతామంటూ  ప్రకటించారు. ఏకంగా రూ.1,500కోట్లతో డిజైన్​ చేసినట్లు ప్రకటించారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ ఇచ్చిన ఈ డిజైన్​ను సర్కారు మూలకు పడేసింది.

అశ్వాపురం–-దుమ్ముగూడెం మధ్య గోదావరిపై ప్రభుత్వం సీతమ్మసాగర్​ బ్యారేజీని నిర్మిస్తోంది. ఈ బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యే అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల రక్షణకు కరకట్టలు నిర్మిస్తున్నారు. అయితే ఇవి కాకుండా సీతమ్మసాగర్​ బ్యారేజీకి దిగువన బూర్గంపాడు మండలంలో గోదావరి–-కిన్నెరసాని సంగమం వరకు 30 కి.మీల మేర, ఈ మధ్యలో ఉన్న 15 చిన్న, పెద్ద వాగుల నుంచి బ్యాక్​ వాటర్​ ముంపు ప్రమాద నివారణకు అక్కడ కూడా కరకట్టలు నిర్మించాలని డిజైన్ చేశారు.

మొదటగా గోదావరికి ఇరువైపులా 124 కి.మీల మేర 80 అడుగుల ఎత్తులో కరకట్టలను కట్టాలని రూ.950కోట్లతో ఎస్టిమేషన్లు తయారుచేశారు. కానీ 2022 జులైలో వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని, పోలవరం బ్యాక్​ వాటర్​ను కూడా దృష్టిలో పెట్టుకుని కట్ట ఎత్తును 100 అడుగులకు పెంచారు.  డిజైన్​ మార్చడంతో బడ్జెట్​ రూ.1,500కోట్లకు పెరిగింది. 

ఎక్స్​పర్ట్స్​ కమిటీ సూచనలకు దిక్కేది..?

2022 జులైలో  వరదల తర్వాత తెలంగాణ సర్కారు ఎక్స్​పర్ట్స్​ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వరద ముంపునకు కారణాలు విశ్లేషిస్తూ రిపోర్ట్​తో పాటు పలు సూచనలు చేసింది. పోలవరం బ్యాక్ వాటర్​,  వరదల సమయంలో భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని  36 పెద్ద, చిన్న వాగులు, ఉపనదుల నుంచి వచ్చిన వరద సజావుగా గోదావరిలో కలవలేకపోవడం, నీళ్లు నిలిచి ఉండడం తదితర  కారణాలున్నాయని తేల్చింది.  ఆ టైమ్​లో 24.22లక్షల క్యూసెక్కుల వరద భద్రాచలం వద్ద ఉందని పేర్కొంది.  అయితే పోలవరం డ్యామ్​  వద్ద  21.59లక్షల క్యూసెక్కులే ప్రవాహం జరిగిందని ఇది కూడా నష్టానికి కారణమేనని చెప్పింది.  

కరకట్టలతో పాటు, వీటిపై 8 చోట్ల స్లూయిజ్​లు ఏర్పాటు చేసి నిరంతరం నీటిని ఎత్తిపోయాలని సూచించింది. ప్రత్యేకంగా డీవాటరింగ్ వ్యవస్థ, ఆపరేషన్​ మెయింటెనెన్స్ చేయాలని,  పంపింగ్​ స్టేషన్​ నిర్మించాలని ఎక్స్​పర్ట్స్​ కమిటీ తెలిపింది. ఈ సూచనలకు దిక్కేలేకుండా పోయింది. ఇంత వరకు ఆ ఏర్పాట్లు చేసిన దాఖాలాలే కన్పించడం లేదు. దీనితో ఈసారీ గోదావరి తీర ప్రాంత ప్రజలకు వరద కష్టాలు తప్పేలా లేవు.

ప్రపోజల్స్ పంపినం..

గోదావరి కరకట్టల కోసం ప్రపోజల్స్ తయారు చేసి పంపాం. ప్రభుత్వం పరిశీలించి ఓకే చేస్తే ఫండ్స్​ వస్తాయి. ఆ తర్వాత స్టెప్​ తీసుకుంటారు.

- వెంకటేశ్వరరావు, ఇన్​చార్జి ఈఈ ఇరిగేషన్​, భద్రాచలం

మాటలే తప్ప పనులు కాలే

కేసీఆర్​ మాటలే తప్ప ఇప్పటి వరకు భద్రాచలంకు మూటలు ఇవ్వలే.  దీంతో ఒక్క పని కూడా కాలే. గోదావరి వరదల సమయంలో వచ్చి రూ.1,000కోట్లు ఇస్తా, కరకట్టలు కడతామని చెప్పి ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు. జిల్లాలోని గోదావరి తీర ప్రాంత జనాలకు మళ్లీ వరద కష్టాలు తప్పేలా లేవు.  వచ్చే నెల నుంచే వర్షాలు, వరదలు మొదలైతయ్​. ఇంకెప్పుడు కడతరు. ఎట్లా కాపాడతరు.  

- పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే