పోడు పట్టాలు రెడీ కాలేదు..మానుకోటలో కేసీఆర్ సభ రద్దు:ఎర్రబెల్లి

  •     మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
  •     మహబూబాబాద్ లో కేసీఆర్​ టూర్ పై మంత్రుల రివ్యూ

మహబూబాబాద్, వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇంకా రెడీ కానందున మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభను రద్దు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ, శిశు, సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వచ్చే నెలలో పోడు పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ నెల 12న మధ్యాహ్నం వరకే సీఎం కేసీఆర్ మహబూబాబాద్ టూర్ ఉంటుందని చెప్పారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మానుకోట అభివృద్ధి చెందిందన్నారు. కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ వల్ల పట్టణ రూపురేఖలు మారిపోయాయన్నారు. జిల్లాలో కొత్తగా నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 330 బెడ్ల హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేశామన్నారు. జిల్లాకేంద్రానికి వచ్చే బీటీ రోడ్డు అధ్వానంగా ఉందని, వెంటనే రిపేర్లు చేసి, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆఫీసర్లను ఆదేశించారు.

కేసీఆర్ పర్యటన ఇలా...

మానుకోటలో సీఎం కేసీఆర్ ఈ నెల 12న ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభిస్తారని మంత్రులు వెల్లడించారు. 11గంటలకు కొత్త కలెక్టరేట్ ప్రారంభించి, 11.30 నుంచి 12.30 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టరేట్ లో ఆఫీసర్లతో రివ్యూ చేస్తారన్నారు.  2 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరుతారని వివరించారు. కేసీఆర్ పర్యటనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తరలిరావాలన్నారు. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్​ రాంమోహన్​రెడ్డి, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఉన్నారు.

స్టూడెంట్లు టెక్నాలజీలో రాణించాలి

తొర్రూరు: స్టూడెంట్లు పాఠశాల స్థాయి నుంచే శాస్ర్త, సాంకేతిక రంగాల్లో రాణించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సూచించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఎంపీ కవితతో కలిసి పరిశీలించారు. స్టూడెంట్లు 130 ఎగ్జిబిట్లను ప్రదర్శనకు పెట్టగా.. వాటిని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రులు 
మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్లతో స్టూడెంట్ల టాలెం ట్ మెరుగుపడుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి, పైస్థాయికి ఎదగాలన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తు న్నారని తెలిపారు. సైన్స్ ఫెయిర్ లో టీచర్ల సహకారం అభినందనీయమన్నారు.