అభివృద్ధి పథంలో కుమ్రంభీం జిల్లా

  •     కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్​కు ప్రారంభోత్సవం
  •     పోడు భూముల పంపిణీకి శ్రీకారం
  •     రెండు జిల్లాపై వరాల జల్లు

ఆసిఫాబాద్ / కాగజ్ నగర్, వెలుగు: మారుమూలన ఉన్న కుమ్రంభీం జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్​ చెప్పారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో ఏర్పాటుచేసిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కొట్నాక భీమ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించి ఎస్పీ సురేష్ కుమార్ ను చాంబర్​లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్ కు చేరుకొని కొత్త కలెక్టరేట్​ను ప్రారంభించారు.  అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొని,  జిల్లా కలెక్టర్ ను కలెక్టర్‌ చాంబర్‌లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో ఏర్పాటుచేసిన  సమావేశంలో సీఎం మాట్లాడారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో అభివృద్ధిలో పరుగుపెడ్తోందన్నారు. రూ.52.2 కోట్లతో  ఆసిఫాబాద్​లో నిర్మించిన  ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ రాష్ట్రంలో 22వ కలెక్టరేట్​ అని సీఎం చెప్పారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీరు, వైద్యసేవలతో ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ కేంద్రంగా ప్రారంభిస్తున్నామని, పట్టాలన్నీ మహిళల పేరు మీద అందిస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.1,649 కోట్లతో 22 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తిచేశామని,  22వ జిల్లాగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే జనం ఎన్నో వ్యయప్రయాసలు పడేవాళ్లని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఎంతో ముందుచూపుతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నారన్నారు.  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 15వేల 519 మంది పోడు రైతులకు 47 వేల 138 ఎకరాలకు పట్టాలు అందించామని సీఎస్​ అన్నారు. దేశంలోనే అత్యధిక పోడు పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు.  

మంచిర్యాల జిల్లాకు రూ.206 కోట్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని స్థానిక సంస్థలకు రూ.206 కోట్ల ఫండ్స్​ ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున ఏడింటికి కలిపి రూ.175 కోట్లు శాంక్షన్​ చేస్తామన్నారు. జిల్లాలో 311 గ్రామపంచాతీయలకు గాను ఒక్కో జీపీకి  రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.31 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్​ఎస్​ బహిరంగ సభలో ఆయన జిల్లాకు వరాలు ప్రకటించారు.  ఎన్నికల ముందట ఇతర జిల్లాలకు వందల కోట్లు ప్రకటించి మంచిర్యాలకు మొండిచేయి చూపడంతో జిల్లా బీఆర్ఎస్ లీడర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై సైలెంట్​అయ్యారు. స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని చెప్పడం తప్పా ఇచ్చింది లేదు. అభివృద్ధి జరిగింది లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 

కుమ్రంభీం జిల్లాపై వరాలు..

కలెక్టరేట్​ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాలపై సీఎం కేసీఆర్​ వరాలు కురిపించారు. ఈ రెండు జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయితీలకు రూ.10 లక్షల చొప్పున మున్సిపాలిటీలకు ఒక్కొక్కదానికి రూ.25 కోట్ల చొప్పున  సీఎం ఫండ్స్​ నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం  ప్రకటించారు. కాగజ్ నగర్ లో కొత్తగా ఐటీఐ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. సిర్పూర్ లోని నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.  కుమ్రంభీం జిల్లా కేంద్రానికి త్వరలో మెడికల్​ కాలేజీ వస్తుందని చెప్పారు.