ఫారిన్​లో సీఎం చిక్కుల్లో సీటు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అలా అమెరికా వెళ్లారో లేదో రాష్ట్రంలో ఇలా ఆయన పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సర్కార్ ఉంటుందా, ఊడుతుందా? అనే ప్రశ్న  తెరమీదకు వచ్చింది.  ముఖ్యమంత్రి విదేశీ  టూర్ లో ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1984 లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీఆర్ ను సీఎం పోస్టు నుంచి పక్కకు తోసేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2012 లో లండన్ టూర్ కు వెళ్లినప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నాలు జరిగాయి.

కర్ణాటకలోని  కాంగ్రెస్ –జేడీ (ఎస్)  ప్రభుత్వ పరిస్థితి మొదటి నుంచి దినదినగండంగానే ఉంది. అధికార కూటమికి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేల రాజీనామాతో రాష్ట్రంలో  పొలిటికల్  క్రైసిస్  మరింత తీవ్రమైంది. కుమారస్వామి నాయకత్వాన గల సర్కార్ కు ఇలాంటివి కొత్త కాదు. ఇలాంటి బెడద  వచ్చినప్పుడల్లా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు.

కుమారస్వామి అలా అమెరికా వెళ్లగానే..
నానా ఇబ్బందులు పడుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్న కర్ణాటక సీఎం కుమారస్వామి రాజకీయ భవిష్యత్తు మొదటి రోజు నుంచి ఊగిసలాటలోనే ఉంది. లేటెస్ట్ గా అలా అమెరికా వెళ్లారో లేదో కర్ణాటకలో  సీన్ మారింది. అధికార కూటమి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. పరిస్థితి చేజారిపోతుందన్న విషయం తెలియడంతో ఆయన హడావుడిగా ఫ్లయిట్ ఎక్కి బెంగళూరు చేరుకున్నారు.

బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్తే ……
1984 లోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ కోసం  అమెరికా వెళ్లినప్పుడు రాష్ట్రంలో  పొలిటికల్ సీన్ మారింది. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమైనట్లు వార్తలందాయి. ఎన్టీఆర్ కేబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న నాదెండ్ల భాస్కర రావు ఈ తిరుగుబాటుకు ప్లాన్ చేసినట్లు రాజకీయ పండితులు అంటుంటారు. అయితే నాదెండ్ల విషయం అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ కు తెలియడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతోనే నాదెండ్ల భాస్కరరావును ఆర్థికమంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో టీడీపీలో  గొడవలు ముదిరాయి. ఎన్టీఆర్ కు అనుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు, నాదెండ్ల కు అనుకూలంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు జట్లు కట్టారు.

మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల అండ తనకే ఉందని అప్పటి గవర్నర్ రాంలాల్ ను నాదెండ్ల భాస్కర రావు నమ్మించారు.  భాస్కరరావు మాటలను నమ్మిన గవర్నర్ రాంలాల్ 1984 ఆగస్టు 16 న ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాదెండ్ల భాస్కరరావుకు వ్యతిరేకంగా  రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.  నాదెండ్లను వెన్నుపోటుదారుడంటూ  ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నిరసనల సంగతి ఇలా ఉంటే,  మెజారిటీ  ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని పేర్కొంటూ గవర్నర్ రాంలాల్ కు ఎన్టీఆర్ లెటర్ ఇచ్చారు.

అసెంబ్లీలో బల పరీక్ష కు రెడీ అన్నారు. అయితే రాష్ట్రంలో ఉంటే నాదెండ్ల వర్గీయులు తన ఎమ్మెల్యేలను ఎత్తుకు వెళ్లే ప్రమాదం ఉందంటూ వారిని కాపాడుకోవడానికి  కర్ణాటకకు తరలించారు. అక్కడి నందీహిల్స్ లో  క్యాంపులు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఈ క్యాంప్ వ్యవహారాలు చూసుకున్నారు.  తర్వాత కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. చివరకు అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో ఎన్టీఆర్ నెగ్గారు. దీంతో 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు మాజీ అయ్యారు. ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

నవీన్ పట్నాయక్ లండన్ వెళ్లినప్పుడు …..
‘మిస్టర్ క్లీన్ ’గా పేరు తెచ్చుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విషయంలోనూ 2012 లో ఇదే జరిగింది. నవీన్ సర్కార్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్లాన్ వేసింది ఆయనకు బాగా దగ్గరివాడైన రాజ్యసభ సభ్యుడు ( బిజూ జనతాదళ్​ ) ప్యారీ మోహన్ మహాపాత్రో కావడం విశేషం. నవీన్ పట్నాయక్ లండన్ చేరుకున్నారో లేదా భువనేశ్వర్ లో పాలిటిక్స్ హీటెక్కాయి. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు మహాపాత్రో  ఇంట్లో సమావేశమయ్యారు. వీరికి మరో ఇద్దరు మంత్రులు తోడయ్యారు. మిగతా ఎమ్మెల్యేలను ఎలా తమ శిబిరంలోకి తీసుకురావాలన్న దానిపై  తర్జన భర్జనలు సాగాయి. భువనేశ్వర్ లో జరుగుతున్న తిరుగుబాటు ప్రయత్నాల సంగతి లండన్ లో ఉన్న నవీన్ పట్నాయక్ కు తెలిసింది. దీంతో  లండన్ నుంచి నవీన్ పట్నాయక్ హుటాహుటిన భువనేశ్వర్ వచ్చారు.  తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇద్దరు మంత్రులు అంజలి బెహెరా, సంజీవ్ సాహు లను తొలగించారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్యారి మోహన్ మహాపాత్రో తోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రవత్ బిశ్వాల్, బిహుభూతి బలవంతరాయ్ లను  పార్టీ నుంచి బహిష్కరించారు.

కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు
కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడ్డాక కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ( సీఎల్పీ) సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు సతీశ్‌‌ జార్కిహోళి, ఉమేశ్‌‌ జాదవ్‌‌, మహేశ్‌‌ కుమటహళ్లి, నాగేంద్ర డుమ్మా కొట్టారు. దీంతో క్యాంపు రాజకీయాలు మళ్లీ  మొదలయ్యాయి.కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బెంగళూరు సిటీ శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్ కు తరలించింది. 2018 మే లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నడిపింది. బెంగళూరు సేఫ్  కాదని భావించి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగరానికి తరలించింది. సిటీలోని ఓ పెద్ద హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉంచారు.

గురుగావ్ లో బీజేపీ శిబిరం
కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యేలను ఈగల్టన్  రిసార్ట్స్ కు తరలిస్తే బీజేపీ తన ఎమ్మెల్యేలను ఢిల్లీకి దగ్గరిలోని గురుగావ్ కు తరలించింది. గురుగావ్ లోని ఓ రిసార్ట్స్ లో  బీజేపీ ఎమ్మెల్యేలు మకాం వేశారు. రాజకీయంగా గందరగోళ పరిస్థితులు సద్దుమణిగాక బీజేపీ ఎమ్మెల్యేలు  గురుగావ్ నుంచి బెంగళూరు వచ్చారు.

సీటు కాపాడుకోవడమే ముఖ్యం
రాజకీయాల్లో  రెండు రెళ్లు నాలుగు అనే సూత్రం పనికి రాదు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మంచి మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోతుంటాయి. మైనారిటీ ప్రభుత్వాలు కూడా ఐదేళ్ల  పూర్తికాలం కొనసాగుతాయి. ఇదంతా ఆయా ముఖ్యమంత్రుల లేదా ప్రధానుల టాలెంట్ పై ఆధారపడి  ఉంటుంది.

ప్లేన్​లో నుంచే ముషారఫ్​ తిరుగుబాటు
మనదేశంలో సీఎంలు విదేశాలకు వెళ్లినప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల తిరుగుబాట్లు జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో అక్కడి  ప్రెసిడెంట్లు లేదా ప్రధానులు ఫారిన్ టూర్ కు వెళ్తే సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాలను కూల్చి వేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ పాకిస్తాన్ లో జరిగిన తిరుగుబాటు. పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ 1999లో కూలదోశారు. చుక్క రక్తం చిందించకుండా  ఎన్నికైన ప్రజా ప్రభుత్వం పై  సైన్యం చేసిన తిరుగుబాటు ఇది. ఆ ఏడాది అక్టోబరు 12న ఈ సంఘటన జరిగింది. దీనికి ఓ ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంతకుముందు కొంతకాలంగా ప్రజా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నవాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్న  ముషారఫ్ మధ్య  పొసగడం లేదు. దీంతో ముషారఫ్ ను కుర్చీ నుంచి దించేయాలని ప్రధాని హోదాలో నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. పర్వేజ్ ముషారఫ్ స్థానంలో అప్పటివరకు ఐఎస్ఐ కీలక పోస్టులో ఉన్న జియావుద్దీన్ బట్ ను  నవాజ్ షరీఫ్ నియమించారు. శ్రీలంకలో అధికారిక పర్యటన ముగించుకుని ముషారఫ్​ విమానంలో పాకిస్తాన్ కు వస్తున్నప్పుడు షరీఫ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన విమానాశ్రయంలో దిగకుండా చేయాలని కూడా షరీఫ్ ప్రయత్నించారు. ముషారఫ్​ మాత్రం విమానంలో ఉండగానే మొత్తం ఆర్మీని తన గుప్పిట్లో ఉండేలా చూసుకున్నారు.

దీంతో సైనికాధికారులు ముషారఫ్ కు అండగా నిలిచారు. కొన్ని  గంటల్లోనే  పాకిస్తాన్ లో పరిస్థితులు తారుమారు అయ్యాయి. దేశంలోని అన్ని ముఖ్యమైన గవర్నమెంట్ ఆఫీసులను అలాగే రేడియో సహా అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలను సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముషారఫ్​ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే నవాజ్ షరీఫ్ ను , ఆయన కేబినెట్ సహచరులను హౌస్ అరెస్ట్ చేశారు. పర్వేజ్ ముషారఫ్  విమానంలో వస్తూనే అలా నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత షరీఫ్​ను ముప్పు తిప్పలు పెట్టి దేశం విడిచి వెళ్లేలా చేశారు.