
కోల్కతా: సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ‘అర్హులైన అభ్యర్థుల’ హక్కులను పరిరక్షిస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తాను ప్రాణాలతో ఉన్నంతవరకూ అర్హులెవరూ ఉద్యోగాలు కోల్పోలేరని చెప్పారు. ఒకవేళ జైలుకెళ్లాల్సి వచ్చినా తన పోరాటం ఆపబోనని అన్నారు. బెంగాల్‌లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది రిక్రూట్మెంట్చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. సోమవారం ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. బాధిత ఉపాధ్యాయులు, సిబ్బంది తమ తమ పాఠశాలలకు తిరిగి వెళ్లి వలంటీర్లుగా విధులు నిర్వర్తించాలని అభ్యర్థించారు.
తీర్పు ఆమోదయోగ్యంగా లేదన్న సీఎం
టీచర్రిక్రూట్మెంట్విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంగాలేదని మమతా బెనర్జీ అన్నారు. ‘‘ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విని నా గుండె బండరాయిగా మారింది. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెట్టే అవకాశం లేకపోలేదు. అయినా వెనుకడుగు వేయను. అర్హులు ఉద్యోగాలు కోల్పోడాన్ని భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు వారి ఉద్యోగాలను కాపాడతాను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి దీనిపై స్పష్టత కోరుతున్నామని, ఒకవేళ అవసరమైతే రివ్యూ పిటిషన్దాఖలు చేస్తామని చెప్పారు.
‘‘కోర్టు నుంచి ఎలాంటి క్లారిఫికేషన్రాకుంటే మేం రెండు నెలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. అర్హత ఉన్న ఏ అభ్యర్థి కూడా నిరుద్యోగిగా ఉండరు. ప్రభుత్వం ఎలాంటి తొలగింపు లేఖలు పంపలేదు. మీరు స్వచ్ఛందంగా బోధన కొనసాగించవచ్చు” అని పేర్కొన్నారు. కొంతమంది డర్టీ గేమ్ ఆడుతున్నారని, ఆ ముసుగుల వెనుక ఉన్న నిజమైన ముఖాలను గుర్తించాలని సీపీఐ (ఎం) నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. చాలామంది తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.