కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దోషికి జీవిత ఖైదు శిక్ష విధించడం సరికాదని.. ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని ఆమె పేర్కొన్నారు.
సోమవారం (జనవరి 20) ముర్షిదాబాద్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మేమంతా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధించింది. కేసు దర్యాప్తు బలవంతంగా కోల్‌కతా పోలీసులు నుంచి సీబీఐకి అప్పగించారు.
అదే కేసు కోల్‌కతా పోలీసుల చేతిలో ఉంటే దోషికి మరణశిక్ష పడేలా చేసేవాళ్లం’’ అని సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఎలా జరిగిందో మాకు తెలియదు.. కానీ రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడేదన్నారు. దోషికి మరణ శిక్ష కాకుండా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు వెలువరించిన తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Raed : కోల్కత్తా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కేసు ఏంటంటే..?
2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్‌కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కోల్కత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ సైతం నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది.