30 కాదు.. ఎక్కువ మందే చనిపోయారు.. ప్రభుత్వం నిజం చెప్పట్లే: CM మమతా బెనర్జీ

30 కాదు.. ఎక్కువ మందే చనిపోయారు.. ప్రభుత్వం నిజం చెప్పట్లే: CM మమతా బెనర్జీ

కోల్‎కతా: మహా కుంభమేళా తొక్కి సలాట ఘటనపై టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం (ఫిబ్రవరి 12) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం బాధకరమన్నారు. యూపీ సర్కార్ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కి సలాట జరిగిందని.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ యంత్రాంగం కుంభమేళా నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కుంభమేళా తొక్కిసలాటలో 30 మందే చనిపోయారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని.. తొక్కి సలాట మృతుల వాస్తవ సంఖ్యను ప్రభుత్వం దాచి పెడుతోందని ఆరోపించారు మమతా బెనర్జీ. మృతుల అసలు సంఖ్యను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర బడ్జెట్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు మమతా. చట్టబద్ధంగా బెంగాల్‎కు రావాల్సిన నిధులను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 

తృణమూల్ కాంగ్రెస్ దోపిడీకి మారుపేరుగా మారిందని, ఆ పార్టీ అవినీతిని సంస్థాగతీకరించిందని, సంస్థలను నిర్వీర్యం చేసిందని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఒంటి కాలిపై లేచారు. బెంగాల్‎కు వ్యతిరేకంగా నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు పక్షపాతంతో కూడినవని ఫైర్ అయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తూ బెంగాల్‎కు నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.