ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే కుట్ర.. జమిలి ఎన్నికల బిల్లుపై CM మమతా ఫైర్

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే కుట్ర.. జమిలి ఎన్నికల బిల్లుపై CM మమతా ఫైర్

బెంగాల్: వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి గురువారం (డిసెంబర్ 12) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతోన్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో మోడీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో త్వరలోనే భారత్ జమిలీ ఎన్నికలు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఈ క్రమంలో జమిలి ఎన్నికల బిల్లుకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలపడంపై బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఈ అంశంపై ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధం, సమాఖ్య వ్యతిరేకమని అభివర్ణించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల కోసం మోడీ సర్కార్ ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానం అధికారాన్ని కేంద్రీకరించడంతో పాటు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నమని దీదీ ఆరోపించారు. 

ALSO READ | వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ అమోదం

రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ఆందోళనలను విస్మరిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర కేబినెట్ బుల్డోజ్ చేసిందని ధ్వజమెత్తారు.జమిలి ఎన్నికల విధానం జాగ్రత్తగా పరిశీలించిన ఎన్నికల సంస్కరణ కాదని.. ఇది భారతదేశాన్ని అణగదొక్కడానికి రూపొందించిన నిరంకుశ చర్య అని విమర్శించారు. మా ఎంపీలు ఈ క్రూరమైన చట్టాన్ని పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకిస్తారని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఢిల్లీ నియంతృత్వ పోకడలకు బెంగాల్ ఎన్నటికీ తలొగ్గదని.. మోడీ నిరంకుశ పాలన నుండి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.