తెలంగాణ–హిరోషిమా ఆటోమోటివ్ కారిడార్

తెలంగాణ–హిరోషిమా ఆటోమోటివ్ కారిడార్
  • హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటాతో తెలంగాణ రైజింగ్​ బృందం చర్చలు
  • హిరోషిమా ప్రిఫెక్చర్‌‌ను సందర్శించిన సీఎం రేవంత్​
  • ముగిసిన జపాన్​ పర్యటన..ఇయ్యాల ఉదయం హైదరాబాద్​కు

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్​బృందం జపాన్‌‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌‌ను సందర్శించి, శాంతి, సాంకేతిక పురోగతి, పరస్పర సహకార అవకాశాలపై చర్చించింది. హిరోషిమా డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌‌తో సమావేశాల్లో క్లీన్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్​, విద్య, సాంస్కృతిక మార్పిడితో పాటు హిరోషిమా-–తెలంగాణ ఆటోమోటివ్ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తావించింది.   

మంగళవారం మొదట  హిరోషిమా ప్రిఫెక్చర్‌‌ను సందర్శించిన బృందం.. హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌‌ మికా యొకోటా తో సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య సహకార అవకాశాలపై చర్చించింది. శాంతి, సాంకేతిక పురోగతి, పరస్పర సహకార అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. హిరోషిమా శాంతి, సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. తెలంగాణ కూడా ఆవిష్కరణలు, సుస్థిరత, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందన్నారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. క్లీన్ టెక్నాలజీ, వ్యర్థ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్​, హైదరాబాద్‌‌లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, హిరోషిమా-–తెలంగాణ ఆటోమోటివ్ కారిడార్ ఏర్పాటు, విద్య, సాంస్కృతిక మార్పిడి, హిరోషిమా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణ వర్సిటీలకు సహకారం, బౌద్ధ వారసత్వం, పీస్ పార్క్ వంటి అంశాలను ప్రస్తావించారు. 

 దూరదృష్టితో తెలంగాణ విజయం: సీఎం రేవంత్​

 సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీని సందర్శించగా.. స్పీకర్ తకాషి నకమోటో,  శాసనసభ్యులు వారికి స్వాగతం పలికారు. అక్కడి అసెంబ్లీలో సీఎం రేవంత్​మాట్లాడుతూ, ‘‘హిరోషిమా ఆశకు చిహ్నం. ప్రజల ఐక్యతతో ఏదైనా సాధ్యమని నిరూపించింది. తెలంగాణ కూడా ఆకాంక్షలు, పోరాటంతో విజయం సాధించిన రాష్ట్రం. దూరదృష్టితో విజయం సాధించింది.” అని పేర్కొన్నారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. శాంతి, సమృద్ధి, స్థిరత్వం కోసం  తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 50కిపైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో పనిచేస్తున్నాయని, మరిన్ని కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో అవకాశాలున్నాయని వివరించారు.  అనంతరం హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్‌‌తో   తెలంగాణ బృందం సమావేశమైంది. తెలంగాణను సందర్శించి, రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్​ బాబు ఆహ్వానించారు. 

తెలంగాణ దేశానికి గేట్ వేగా.. ప్రపంచానికి విస్తరించే వేదికగా ఉంటుందని అన్నారు. హిరోషిమా–-హైదరాబాద్, జపాన్-–తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత  సీఎం బృందం గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్‌‌లను సందర్శించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డికి  ప్రవాస తెలుగు అమ్మాయిలు  తమ చేతితో వేసిన వెల్​కం డ్రాయింగ్స్​ను బహూకరించారు. 

జపాన్​ పర్యటనలో రూ.12,062 కోట్ల పెట్టుబడులు

సీఎం  బృందం జపాన్​ పర్యటన  మంగళవారంతో ముగిసింది. బుధవారం ఉదయం  హైదరాబాద్​కు చేరుకోనున్నది. ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్​ బృందం జపాన్​ పర్యటకు వెళ్లింది.  వారం పాటు అక్కడ పర్యటించింది.  దాదాపు 30,500 ఉద్యోగాలు వచ్చేలా రూ.12,062 కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో మారుబెని కంపెనీ తో  హైదరాబాద్‌‌ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అగ్రిమెంట్​జరిగింది. 

రూ.వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడి, రూ.5వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో 30వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది.  ఎన్ టీ టీ డేటా, నెయిసా సంయుక్తంగా హైదరాబాద్‌‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు రూ.10,500 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకోనున్నారు. తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాతో హైదరాబాద్​సమీపంలోని  రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రూ.562 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదిరింది.   జపాన్‌‌లో  తెలంగాణకు చెందినవారికి 500 ఉద్యోగాల నియామకాల కోసం టామ్​ కామ్​  తో టెర్న్, రాజ్ గ్రూప్ అగ్రిమెంట్​ చేసుకున్నాయి.