కేజ్రీవాల్‎కు షాక్.. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైన సీఎం నాయబ్ సింగ్ సైనీ..!

కేజ్రీవాల్‎కు షాక్.. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైన సీఎం నాయబ్ సింగ్ సైనీ..!

ఛండీఘర్: హర్యానా ప్రభుత్వం యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలు పోసి నదీ జలాలను విషపూరితం చేస్తోందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు వివాదానికి దారి తీశాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం మండిపడింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ. ఈ విషయాన్ని హర్యానా అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ కామెంట్స్‎కు సీఎం నాయబ్ సింగ్ సైనీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేసి పారిపోవడం కేజ్రీవాల్‎కు అలవాటని.. అదే ఆయన స్వభావం అని విమర్శించారు. ఉమ్మివేసి పరిగెత్తండి అనే తీరుగా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

యమునా నదిలో అమ్మోనియా వంటి విషపూరిత పదార్థాలు కలిపి నది జలాలను కలుషితం చేస్తు్న్నామంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ఖండించారు. ఇరు రాష్ట్రాల సీఎస్‎లను పంపి హర్యానా నుంచి ఢిల్లీకి యమునా నది జలాలు ఎంటరయ్యే  సోనిపట్ వద్ద నీటిని పరీక్షిద్దామని సవాల్ విసిరారు. యుమునా నదిలో నీటి కొరత లేదని.. ఢిల్లీ ప్రభుత్వ తీరుతో నీటి పంపిణీలో సమస్య ఉందన్నారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన  తాగు నీరు అందిస్తానని వాగ్ధానం చేసిన కేజ్రీవాల్.. 10 సంవత్సరాలలో కూడా పరిశుభ్రమైన నీటిని అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు.  

ALSO READ | మోడీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే పోతారు: మల్లికార్జున ఖర్గే

కేజ్రీవాల్ తీరుతో ఇప్పటికీ ఢిల్లీ ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తోందన్నారు. ఇకనైనా తప్పుడు ఆరోపణలు చేయడం మాని పాలనపై దృష్టి పెట్టాలని కేజ్రీవాల్‎కు చురకలంటించారు సీఎం సైనీ. ‘‘హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిని విషపూరితం చేసింది. ఢిల్లీ జల్ బోర్డు దీనిని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఢిల్లీలో సామూహిక నరమేధం జరిగేది’’ అంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలు హర్యానా, ఢిల్లీ మధ్య తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యాఖ్యలకు హర్యానా సీఎం, ఇతర మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు.