హర్యానాలో బీజేపీ విజయానికి కారణం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన సీఎం సైనీ

హర్యానాలో బీజేపీ విజయానికి కారణం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన సీఎం సైనీ

చండీఘర్: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన సైనీ.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మేవా సింగ్‌పై 16,054 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేస్తూ హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 50 చోట్ల అధిక్యంలో ఉన్నా బీజేపీ.. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 సీట్ల మేజిక్ ఫిగర్‎ను క్రాస్ చేసి హ్యాట్రిక్ విజయం సాధించబోతుంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఊహించని విధంగా సత్తాచాటడంపై సీఎం నాయబ్ సింగ్ సైనీ సంతోషం వ్యక్తం చేశారు. 

ALSO READ | వీడిన ఉత్కంఠ.. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన CM నాయబ్ సింగ్ సైనీ

ఇవాళ (2024, అక్టోబర్ 8) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విధానాల వల్లే హర్యానాలో బీజేపీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. మరోసారి బీజేపీని ఆదరించినందుకు రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘లాడ్వా నియోజక వర్గ ప్రజలతో పాటు హర్యానాలోని 2.80 కోట్ల జనాభాకు కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ ప్రధాని మోడీకి చెందుతుంది. హర్యానా ప్రజలు ప్రధాని మోడీ విధానాలకు ఆమోద ముద్ర వేశారు’’ అని అన్నారు. హర్యానాలోని 2.80 కోట్ల మంది ప్రజలు మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని..  ప్రధాని మోడీ నాయకత్వంలో మరింత ముందుకు సాగుతామన్నారు.