మీరు చెప్పారు.. మేం చేసి చూపిస్తాం: అసెంబ్లీలో కేజ్రీవాల్‏పై సీఎం రేఖాగుప్తా ఫైర్

మీరు చెప్పారు.. మేం చేసి చూపిస్తాం: అసెంబ్లీలో కేజ్రీవాల్‏పై సీఎం రేఖాగుప్తా ఫైర్

న్యూఢిల్లీ: మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‎పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఫైర్ అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం (మార్చి 25) అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా వదిలేశారని విమర్శించారు. కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని పునరుద్ధరించడానికి రూ.45 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని.. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన శీష్ మహాల్ ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ సీఎంలా కాకుండా ఢిల్లీకి మాలిక్‎గా వ్యవహరించాడని విమర్శలు గుప్పించారు. 

ఢిల్లీని లండన్‎లా మారుస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్.. నగరాన్ని ట్రాఫిక్ జామ్‎లకు నిలయంగా మార్చాడని ఎద్దేవా చేశారు. ‘‘మీకు మాకు మధ్య చాలా తేడా ఉంది. మీరు వాగ్దానాలు చేసి వదిలేస్తారు.. కానీ మేం ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం. మీరు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను దుర్వినియోగం చేశారు. కానీ మేము వాళ్లతో కలిసి పనిచేస్తాం. మీరు విలాసవంతమైన శీష్ మహాల్ నిర్మించారు.  మేం పేదలకు ఇళ్ళు నిర్మిస్తాము. మీరు లక్షల విలువైన (బంగారు) మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మేము పేదలకు మరుగుదొడ్లు నిర్మిస్తాం’ అని సీఎం రేఖాగుప్తా అన్నారు. ఢిల్లీని 'పర్యాటక కేంద్రంగా' అభివృద్ధి చేసే ప్రణాళికలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. శీష్ మహాల్‎ను  పర్యాటక కేంద్రంగా మార్చి పేద ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 

ALSO READ | Tihar Jail: పెద్దపెద్దోళ్లే చిప్పకూడు తిన్న.. తీహార్ జైలు షిఫ్ట్.. డిసైడ్ అయిన ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం

కాగా, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రెనోవేషన్ చేసేందుకు రూ.45 కోట్లు ప్రజా దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయమంతా శీష్ మహాల్ చుట్టే తిరిగింది. కేజ్రీవాల్‎ను, ఆప్ సర్కార్‎ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ శీష్ మహాల్ ఇష్యూని ఆయుధంగా వాడుకుంది. శీష్ మహాల్ ఇష్యూ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఎన్నికల్లో ఆప్‎కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శీష్ మహాల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాలతో ఆప్ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. బీజేపీ దాదాపు 27 సంవత్సరాలతో తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది.