
ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై దాడులు పెంచారు వైద్యాధికారులు. తప్పుడు బిల్లులతో సీఎం రిలీఫ్ కాజేస్తున్న హాస్పిటల్స్ పై కొరడా ఝులిపిస్తున్నారు. మంగళవారం (ఏప్రిల్ 22) రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ఆస్పత్రులలో సోదాలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో సోదాలు నిర్వహించారు. బాలాపూర్ చౌరస్తాలో ఉన్న హిరణ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేశారు వైద్యాధికారులు. ఆస్పత్రి యాజమాన్యం గత కొంతకాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉప వైద్యాధికారి గీత, సంబంధిత అధికారులతో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు.