- బోగస్ బిల్లులతో..సీఎం రిలీఫ్ ఫండ్
- బెల్లంపల్లి నియోజకవర్గంలో కోట్లలో గోల్మాల్
- బుధాకలాన్లోనే రూ.అర కోటికి పైగా స్వాహా
- ఎమ్మెల్యే పీఏలు, అనుచరులే ప్రధాన సూత్రధారులు
- 30 మందికి చెక్కులు నిలిపివేసిన ఆఫీసర్లు
- తమకేం ఫిర్యాదులు రాలేదన్న ఆర్డీవో
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగమవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు బోగస్ బిల్లులు పెట్టి లక్షల్లో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో ఆఫీసర్లు 30 మందికి చెక్కులు నిలిపివేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పీఏలతో పాటు ఆయన ప్రధాన అనుచరులే ఈ దందాలో సూత్రధారులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి మండలం బుధాకలాన్కు చెందిన ఓ మాజీ సర్పంచ్, వేమనపల్లికి చెందిన ఓ మండల స్థాయి నాయకుడు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ భారీ మొత్తంలో స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు హల్చల్ చేస్తున్నాయి.
కమీషన్లు, బోగస్ బిల్లులు..
లాక్డౌన్ టైమ్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.లక్ష వరకు ఖర్చయితే బిల్లులో 40 శాతం, లక్ష దాటితే బిల్లులో 80 శాతం సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ త్రీమెన్ కమిటీ పరిశీలించి ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది. చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు. ఇదే అదనుగా ఎమ్మెల్యేల అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బెల్లంపల్లిలోనూ ఇదే విధంగా సీఎంఆర్ఎఫ్లో భారీగా గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ కోసం పైరవీలు చేసినందుకు లోకల్ లీడర్లు బిల్లును బట్టి రూ.10వేల నుంచి రూ.50వేల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. పలువురు వ్యక్తుల పేరిట బోగస్ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ను స్వాహా చేస్తున్నారు. అధికార పార్టీ లీడర్లు పార్టనర్లుగా ఉన్న మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్, వారికి సంబంధించిన మరో హాస్పిటల్తో పాటు కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటళ్ల నుంచి ఈ బోగస్ బిల్లులు తీసుకుంటున్నట్టు
సమాచారం.
దరఖాస్తు చేయకుండానే చెక్కులు..
బెల్లంపల్లి మండలం బుధాకలాన్కు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల కింద కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ అతడు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయలేదు. కానీ అతడి భార్య పేరిట అక్రమార్కులు బోగస్ బిల్లులు తయారుచేసి సీఎంఆర్ఎఫ్ డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ చేయించుకు న్నాడు. రూ.82 వేల బిల్లు కాగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ అయింది. నాయకుడు అడిగిన డబ్బులు ఇవ్వనందుకే తన దరఖాస్తును రిజెక్ట్ చేయించినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఒక్క బుధాకలాన్ లోనే రూ.అరకోటికిపైగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. అలాగే వేమనపల్లికి చెందిన ఓ మండల లీడర్ పలువురి పేరిట బోగస్ బిల్లులు పెట్టి చెక్కులు డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే పీఏ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవిని వివరణ కోరగా.. సీఎంఆర్ఎఫ్లో అక్రమాలు జరిగిన విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య వివరణ కోసం ఫోన్ చేస్తే స్పందించలేదు.